Japan-India: మోదీ పర్యటనతో మారిన పరిస్థితులు.. 47 ఏళ్ల తరువాత కీలక నిర్ణయం తీసుకున్న జపాన్..

|

May 28, 2022 | 3:41 PM

Japan-India: ప్రధాని మోదీ జపాన్ పర్యటన భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కీలకంగా మారనుంది. మోదీ పర్యటన తరువాత వారం కూడా గడవక ముందే ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది.

Japan-India: మోదీ పర్యటనతో మారిన పరిస్థితులు.. 47 ఏళ్ల తరువాత కీలక నిర్ణయం తీసుకున్న జపాన్..
Pm Modi
Follow us on

Japan-India:ప్రధాని మోదీ జపాన్ పర్యటన భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కీలకంగా మారనుంది. జపాన్ యుద్ధ విమానాలు, కొత్తరకం ఇంటర్‌సెప్టర్ క్షిపణులతో సహా ఇతర ఆయుధాలను అమ్మేందుకు విధాన మార్పును తీసుకొస్తోంది. ముఖ్యంగా ఇండో-పసిఫిక్ భద్రత పునరుజ్జీవం, ఉద్రిక్త భౌగోళిక రాజకీయ పరిస్థితుల మధ్య దాని కొత్త రక్షణ పరిశ్రమను పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా, యూరోపియన్, ఆగ్నేయాసియాలోని 11 దేశాలకు ఆయుధాలను ఎగుమతి చేయడానికి జపాన్ సిద్ధంగా ఉంది. క్వాడ్ సమ్మిట్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ.. జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిదాను కలిసిన వారంలోపే ఈ పరిణామాలు చోటుచేసుకోవటం విశేషం. రక్షణతో సహా ద్వైపాక్షిత భద్రత, రక్షణ సహకారం మెరుగుపరుకునేందుకు ఇరువురు నాయకులు ఈ సమావేశంలో అంగీకరించారు. ఇంతకు ముందు 2015లో జపాన్, భారత్ డిఫెన్స్ ఎక్విప్‌మెంట్ అండ్ టెక్నాలజీ బదిలీకి సంబంధించి ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. దీనికి తోడు భారత్, జపాన్ సైన్యం మధ్య 2020, 2021లో మరిన్ని కీలక ఒప్పందాలు జరిగాయి.

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ సైనికీకరణ విధానాన్ని అనుసరించింది. అధికారికంగా అన్ని ఆయుధాల ఎగుమతులపై నిషేధం విధించింది. 1967లో అప్పటి జపాన్ ప్రధాన మంత్రి సటో ఈసాకు ఆధ్వర్యంలో.. జపాన్ ఆయుధాల ఎగుమతుల విషయంలో మూడు సూత్రాలను రూపొందించింది. ఇది ఇతర దేశాలకు అన్ని ఆయుధాల అమ్మకాలను నిషేధించింది. అయితే జపాన్ యునైటెడ్ స్టేట్స్‌కు మినహాయింపు ఇచ్చింది. 2014లో ప్రధాన మంత్రి షింజో అబే ఆధ్వర్యంలోని పరిపాలన రక్షణ ఎగుమతులను నిషేధించే నిబంధనలను సడలించడంతో 47 సంవత్సరాల తర్వాత నిర్ణయం తీసుకుంది. అబే ప్రభుత్వం రక్షణ పరికరాల బదిలీకి సంబంధించి ఒక సూత్రాన్ని ఏర్పాటు చేసింది.

జపాన్‌తో సంయుక్తంగా ఆయుధాలను అభివృద్ధి చేయని దేశాలకు ఎగుమతులు రెస్క్యూ, రవాణా, హెచ్చరిక, నిఘా మరియు మైన్‌స్వీపింగ్ మిషన్లకు సంబంధించిన పరికరాలకు పరిమితం చేయబడతాయని రూల్స్ ఉన్నాయి. కానీ.. ఇప్పటి వరకు టోక్యో నుండి హెచ్చరిక మరియు నియంత్రణ రాడార్ అందుకున్న ఫిలిప్పీన్స్‌తో మాత్రమే రక్షణ ఎగుమతి ఒప్పందం ఉంది. రక్షణ ఎగుమతులపై కొత్త నిబంధనలు జూన్‌లో ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. సడలించిన విధానంతో, మార్కెట్ లేకపోవడం, పోటీ కారణంగా కుంగిపోయిన తన దేశీయ రక్షణ తయారీకి జపాన్ ఊతమివ్వనుంది. ఇతర దేశాలకు సరసమైన ఆయుధ వ్యవస్థలను సరఫరా చేసే సంస్థగా కూడా జపాన్ ముఖ్యమైన పాత్ర పోషించనుంది. చైనా దూకుడును కట్టడి చేసేందుకు ఇది భారత్ కు ఎంతగానో ఉపకరిస్తుందని నిపుణులు అంటున్నారు. చైనా దురాక్రమణల మధ్య జపాన్ తన రక్షణ పరిశ్రమను తెరవడానికి ఇది అనుకూలమైన సమయం. 2017-2021లో భారత్, సౌదీ అరేబియాలు అతిపెద్ద ఆయుధ దిగుమతిదారులుగా అవతరించినందున, జపాన్‌కు ఇది లాభదాయకమైన అవకాశంగా చెప్పుకోవాలి.