జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. కశ్మీర్ పండిట్లను టార్గెట్ చేస్తూ శనివారం కాల్పులు జరిపారు. షోపియాన్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో పురన్ కిషన్ భట్ అనే కశ్మీర్ పండిట్ చనిపోయాడు. ఉగ్రవాదులు కాల్పుల్లో గాయపడ్డ కిషన్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కశ్మీర్ పండిట్ చనిపోయినట్లు అధికారులు తెలిపారు. తోటలో పనిచేయడానికి వెళ్తుండగా మాటు వేసి పురన్ కిషన్ భట్‌పై శనివారం ఉదయం కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. షోపియాన్‌లోని చౌదరి గుండ్ వద్ద ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఉగ్రవాదులు మరెవరిపైనా దాడి చేయలేదని.. సమాచారం అందుకున్న వెంటనే.. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. గత ఏప్రిల్ నుంచి జమ్ముకశ్మీర్‌లో కశ్మీర్ పండిట్లను వరుసగా టార్గెట్ చేస్తున్నారు ఉగ్రవాదులు.
పురన్ కిషన్ భట్ హత్యకు నిరసనగా జమ్ముకశ్మీర్‌లో కశ్మీర్ పండిట్లు భారీ ఆందోళన చేపట్టారు. జమ్ములో భారీ ర్యాలీ తీశారు. ఉగ్రదాడుల నుంచి రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. రోడ్డుపై కశ్మీర్ పండిట్లు బైఠాయించారు. ఉగ్రవాదులకు, పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జమ్ముకశ్మీర్‌లో కశ్మీర్ పండిట్లకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆగస్టులో..
కాశ్మీర్‌లో కశ్మీరీ పండిట్‌లు, వలస కూలీలను ఉగ్రవాదులు నిరంతరం లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆగస్టు 16న షోపియాన్‌లో మరో కాశ్మీరీ పండిట్ సునీల్ కుమార్ భట్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపగా, అతని సోదరుడు పింటూ ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. సోదరులిద్దరూ షోపియాన్‌లోని ఛోటేపోరా ప్రాంతంలోని తమ యాపిల్ తోటల్లో పనిచేస్తుండగా.. ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అంతకుముందు కూడా పలువురు ప్రాణాలు కోల్పోయారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..