జమ్ముకశ్మీర్‌లో రెండో విడత ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. రాజోరితో పాటు తానామండి, నౌషేరా సభలో పాల్గొన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా. కశ్మీర్‌లో వేర్పాటువాదాన్ని అంతం చేసిన ఘనత మోదీ సర్కార్‌దే అన్నారు. స్థానిక సంస్థలను విజయవంతంగా నిర్వహించినట్టు చెప్పారు. కాంగ్రెస్-NC కూటమిపై మండిపడ్డారు అమిత్‌షా
జమ్మూకశ్మీర్‌లోని నౌషేరాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జమ్మూకశ్మీర్‌లో ఈ రెండు పార్టీల ప్రభుత్వం ఏర్పడదని జోస్యం చెప్పారు. జమ్మూ కాశ్మీర్‌లో కాంగ్రెస్ హక్కులను లాగేసుకుందని ఆరోపించిన అమిత్ షా.. కశ్మీర్ ప్రజలకు 70 ఏళ్లుగా హక్కులు రాలేదన్నారు. ఆర్టికల్ 370ని వెనక్కి తీసుకురావాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని విరుచుకుపడ్డారు.
జమ్మూ కాశ్మీర్‌లో నేడు మన త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగురుతున్నదని, అయితే కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ వాళ్లు మాత్రం షేక్ అబ్దుల్లా జెండాను తిరిగి తీసుకురావాలని కోరుకుంటున్నారని షా ఆరోపించారు. ఫరూక్ సాహెబ్, మీకు కావలసినంత బలాన్ని ఉపయోగించండి.. కానీ ఇప్పుడు మన త్రివర్ణ పతాకం మాత్రమే కాశ్మీర్‌లో రెపరెపలాడుతుందని అమిత్ షా స్పష్టం చేశారు. బుల్లెట్లకు బుల్లెట్లతో సమాధానం చెబుతామన్నారు అమిత్ షా. మోదీ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని నరకంలో పాతిపెట్టిందని గుర్తు చేశారు.
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అంతమొందించే వరకు పాకిస్థాన్‌తో మాట్లాడబోమని కేంద్ర హోంమంత్రి స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని అంతమొందించిన తర్వాతే పాకిస్థాన్‌తో చర్చలు జరుపుతామన్నారు. నియంత్రణ రేఖపై వాణిజ్యాన్ని పునరుద్ధరించాలని, రాళ్లదాడి చేసిన వారిని విడుదల చేయాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లో ఏ ఉగ్రవాది స్వేచ్ఛగా సంచరించరని అమిత్ షా హామీ ఇచ్చారు.
జమ్మూకశ్మీర్‌లో 30 ఏళ్లుగా ఉగ్రవాదం కొనసాగుతోందన్నారు. జమ్మూకశ్మీర్‌లో 30 ఏళ్లలో 3 వేల రోజులు కర్ఫ్యూ ఉంది. 40 వేల మంది చనిపోయారు. ఫరూఖ్ సాహెబ్, ఆ రోజుల్లో ఎక్కడ ఉన్నారు? కాశ్మీర్ కాలిపోతున్నప్పుడు, ఫరూక్ సాహెబ్ లండన్‌లో హాలిడేని ఎంజాయ్ చేస్తున్నాడు. మోదీజీ వచ్చాక సెలెక్టివ్‌గా ఉగ్రవాదులను అంతమొందించామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
नौशेरा की जनता जम्मू-कश्मीर से दहशतगर्दी को समाप्त करने वाली भाजपा के साथ है। नौशेरा की जनसभा से लाइव… https://t.co/gpkDVnPbF0
— Amit Shah (@AmitShah) September 22, 2024
పహారీ, గుర్జార్ బకర్వాల్, దళిత, వాల్మీకి, ఓబీసీ వర్గాలకు ఇచ్చిన రిజర్వేషన్లపై పునరాలోచిస్తామని కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ చెప్పాయని షా చెప్పారు. రాహుల్ గాంధీ అమెరికా వెళ్లి రిజర్వేషన్లు రద్దు గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు వారు అభివృద్ధి చెందారు. వారికి ఇక రిజర్వేషన్ అవసరం లేదంటున్నారు రాహుల్ బాబా, ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు తొలగించనివ్వమని అమిత్ షా తేల్చి చెప్పారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, PDP పహారీ సోదర సోదరీమణుల నుండి 70 ఏళ్లుగా రిజర్వేషన్ హక్కును కాలరాసాయని అమిత్ షా మండిపడ్డారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..