
భారతదేశం స్వదేశీ కమర్షియల్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ దిశగా మరో కీలక అడుగు వేసింది. దేశంలోనే తొలి 200 సీట్ల సింగిల్-ఐల్ కమర్షియల్ ఎయిర్‌క్రాఫ్ట్ అభివృద్ధి లక్ష్యంగా హంస ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఏర్నోవా ఇంజనీరింగ్ డివిజన్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టాయి. ఇందుకు సంబంధించి ఇరు సంస్థలు ఫార్న్‌బరో అంతర్జాతీయ ఎయిర్‌షో-2026లో అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేశాయి. ఈ భాగస్వామ్యం ద్వారా ఇండియాలో ప్రపంచ స్థాయి ప్రయాణికుల విమానాన్ని రూపకల్పన చేయడం, ధృవీకరించడం, పారిశ్రామికీకరించడం, తయారు చేయడానికి అవసరమైన జాతీయ ఏరోస్పేస్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి సారించనున్నారు. విమాన రూపకల్పనతో పాటు ఇంజనీరింగ్ నైపుణ్యం, ఆధునిక తయారీ సాంకేతికత, పారిశ్రామిక భాగస్వామ్యాలు, దేశీయ సరఫరా గొలుసు అభివృద్ధికి కూడా ఈ ప్రాజెక్టు ప్రాధాన్యం ఇవ్వనుంది.
ఈ ఒప్పందం కింద ఏరోస్ట్రక్చర్స్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ ఆర్కిటెక్చర్, మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్, డిజిటల్ ఇంజనీరింగ్ వంటి కీలక రంగాల్లో ఇరు సంస్థలు కలిసి అవకాశాలను పరిశీలించనున్నాయి. భవిష్యత్‌లో భారత విమానయాన పరిశ్రమకు బలమైన సాంకేతిక పునాది వేయడం ఈ సహకారం ప్రధాన ఉద్దేశం. ఈ విషయంపై హంస ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ ఉమేష్ వంకాయలపాటి మాట్లాడుతూ.. ఇండియాలోనే 200 సీట్ల స్వదేశీ వాణిజ్య విమానాన్ని రూపొందించి, ధృవీకరించి, తయారు చేయాలన్నదే మా లక్ష్యం. ఇందుకోసం కేవలం విమానాన్ని అభివృద్ధి చేయడం మాత్రమే కాకుండా, దేశంలో పూర్తి స్థాయి ఏరోస్పేస్ ఎకోసిస్టమ్‌ను నిర్మించడం కూడా అత్యంత అవసరం. ఆ దిశగా ఏర్నోవాతో ఈ భాగస్వామ్యం కీలక మైలురాయి అని పేర్కొన్నారు.
ఏర్నోవా ఇంజనీరింగ్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జువాన్ కార్లోస్ ఒర్టిజ్ మాట్లాడుతూ.. ఏరోస్ట్రక్చర్స్ రంగంలో తమ అనుభవాన్ని ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అందించనున్నట్లు తెలిపారు. ఇండియాలో అధునాతన ఏరోస్పేస్ సామర్థ్యాల అభివృద్ధికి తమ సంస్థ పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. హంస ప్రోగ్రామ్ స్ట్రాటజిక్ అడ్వైజర్ డేనియల్ హేస్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఏరోస్పేస్ అనుభవాన్ని భారత ఇంజనీరింగ్ ప్రతిభతో మేళవించి, భవిష్యత్ తరాల ప్రయాణికుల విమానాల తయారీకి బలమైన పునాదిని వేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ ఒప్పందం అనంతరం ఇరు సంస్థలు సంయుక్తంగా సాంకేతిక కార్యశాలలు, ఇంజనీరింగ్ అధ్యయనాలు నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను రూపొందించనున్నాయి.