Sri Lanka High Alert: బంగారు లంక మరోసారి నిప్పులు చెరిగింది. ఈసారి ఆర్థిక సంక్షోభం భారతదేశం పొరుగు దేశాన్ని విధ్వంసం అంచుకు తీసుకువచ్చింది. ఇప్పుడు లంక సెగలు భారత్‌ను తాకాయి. దీంతో శ్రీలంకకు భారత ఇంటెలిజెన్స్ హై అలర్ట్ చేసింది. శ్రీలంకలో తీవ్ర సంక్షోభంతో లంకేయులు భారత్‌కు తరలివెళ్తున్నారని హెచ్చరించింది ఇంటిలిజెన్స్ బ్యూరో. సముద్ర మార్గంలో ఇండియాకు వలస వెళ్తున్నారని హై అలర్ట్ జారీ చేసింది. తీర ప్రాంతంలో మరింత గస్తీ పెంచాలని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
అటు 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతమున్న ఆంధ్రప్రదేశ్‌ని కూడా అప్రమత్తం చేసింది ఇంటెలిజెన్స్. శరణార్థులు ఫిషర్‌మెన్‌లా తలదాచుకోవడానికి వస్తున్నారని తెలిపాయి కేంద్ర నిఘా వర్గాలు. ఏపీ కోస్ట్‌గార్డ్, మెరైన్ సిబ్బందిని అప్రమత్తం చేశాయి. దీంతో సముద్రంలో మరింతగా పెట్రోలింగ్ పెంచింది ఏపీ కోస్ట్‌గార్డ్. అలాగే తీర ప్రాంతాల్లో మత్స్యకారులను అలర్ట్ చేశారు ఏపీ పోలీసులు. సముద్రంలో అపరిచిత బోట్లు, వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
మరోవైపు భారత నిఘావర్గాల సూచనతో శ్రీలంక అధికారులు అప్రమత్తమయ్యారు. తీర ప్రాంతాల నుంచి బోట్లలో లంకేయులు ఎవరూ దేశం దాటి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు.