వీడియో కాల్‌లో పాకిస్థాన్‌ యువతితో CRPF జవాన్‌ పెళ్లి.. ఇండియాలో కాపురం! సినిమా స్టోరీ కాదు.. మతిపోగొట్టే నిజం!

CRPF జవాన్ మునీర్ అహ్మద్ గతేడాది పాకిస్థాన్ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె భారతదేశానికి వచ్చిన తర్వాత, పహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్ పౌరులను వెనక్కి పంపే నిర్ణయం వల్ల ఆమె బహిష్కరణకు ముప్పు ఏర్పడింది. మునీర్‌ను CRPF ఉద్యోగం నుండి తొలగించారు. తనకు అన్యాయం జరిగిందని, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా న్యాయం చేయాలని ఆయన కోరుతున్నాడు.

వీడియో కాల్‌లో పాకిస్థాన్‌ యువతితో CRPF జవాన్‌ పెళ్లి.. ఇండియాలో కాపురం! సినిమా స్టోరీ కాదు.. మతిపోగొట్టే నిజం!
Crpf Jawan Muneer And His W

Updated on: May 04, 2025 | 6:38 PM

ఓ CRPF(సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్) జవాన్‌.. గతేడాది పాకిస్థాన్‌ యువతిని వీడియో కాల్‌ ద్వారా పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని నెలలకు అంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ యువతి ఇండియాకు వచ్చింది. జవాన్‌ కూడా సెలవుపై ఇంటికి తిరిగి వచ్చి.. ఆమెతో ఇండియాలోని తన ఇంట్లో కాపురం పెట్టాడు. పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం ఇండియాలోని పాకిస్థాన్‌ వెళ్లిపోవాలని కోరింది, సరైన పత్రాలు లేకుండా ఇండియాలో ఉన్న పాక్‌ పౌరులను వెతికి మరీ పాక్‌కు తిరిగి పంపాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ఆదేశించింది. దీంతో పోలీసులు CRPF జవాన్‌ భార్యను కూడా పాకిస్థాన్‌ వెళ్లాలని కోరారు. పాక్‌ అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసి.. CRPF అధికారులు ఆ జవాన్‌ను విధుల నుంచి తొలగించారు.

దీంతో.. తనకు ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా న్యాయం చేయాలని ఆ జవాన్‌ కోరుతున్నాడు. కానీ, CRPF వాదన మరోలా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.. జమ్మూ కశ్మీర్‌లో CRPF జవాన్‌గా సేవలు అందిస్తున్న మునీర్ అహ్మద్, మేనాల్ ఖాన్ అనే పాకిస్థాన్‌ యువతిని గత ఏడాది మే 24న వీడియో కాల్ ద్వారా వివాహం చేసుకున్నాడు. అక్టోబర్‌లో వివాహం గురించి తాను CRPF అధికారులకు తెలియజేశానని మునీర్ చెప్పారు. ఈ ఫిబ్రవరిలో మేనాల్ ఖాన్ వాఘా-అట్టారి సరిహద్దు ద్వారా భారతదేశానికి వచ్చి మునీర్ అహ్మద్‌తో కలిసి జీవించడం ప్రారంభించింది. ఆమె 15 రోజుల గడుపు ఉన్న వీసా మార్చిలో ముగిసింది. ఆ తర్వాత మునీర్ దీర్ఘకాలిక వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు.

ఒక నెల తర్వాత పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌ పౌరులను వెనక్కి పంపాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మేనాల్‌ ఖాన్‌ వీసా గడుపు ముగిసిన విషయం బయటపడింది. కానీ, జమ్మూ కశ్మీర్ హైకోర్టు ఆమెను వెనక్కి పంపకుండా ఆదేశాలు ఇచ్చింది. అయితే మునీర్ అహ్మద్ చర్యలు జాతీయ భద్రతకు హానికరం కాబట్టి ఆయనను తొలగించినట్లు CRPF అధికారులు తెలిపారు. మునీర్ అహ్మద్‌ను పాకిస్తాన్ జాతీయురాలితో వివాహం దాచిపెట్టి, ఆమెకు వీసా చెల్లుబాటుకు మించి తెలిసి ఆశ్రయం కల్పించినందుకు తక్షణమే సర్వీసు నుండి తొలగించాం. అతని చర్యలు సేవా ప్రవర్తనను ఉల్లంఘించడం, జాతీయ భద్రతకు హానికరం అని తేలింది అని సీఆర్‌పీఎఫ్ ప్రతినిధి డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఎం దినకరన్ అన్నారు.

ప్రధాని మోదీ న్యాయం చేయాలి..

అయితే మునీర్‌ మాత్రం తనకు అన్యాయం జరిగిందని అంటున్నాడు. తన పెళ్లి గురించి, వీసా గడువు ముగింపు గురించి అన్ని విషయాల గురించి తాను సమాచారం ఇచ్చాను, తన దగ్గర రుజువు ఉంది అని అంటున్నాడు. సెలువు తర్వాత నేను మార్చి 23న తిరిగి విధుల్లో చేరాను. అప్పుడే అధికారులకు అన్ని వివరాలు అందించాను. ఆమె వీసా కాపీని ఇచ్చి, లాంగ్ టర్మ్ వీసా దరఖాస్తు గురించి చెప్పాను. అకస్మాత్తుగా నన్ను (భోపాల్‌కు) బదిలీ చేశారు. 2027 వరకు నేను జమ్మూ కశ్మీర్‌లో విధులు నిర్వర్తించాల్సి ఉంది. అయినా వేరే బెటాలియన్‌కు బదిలీ చేస్తే, 15 రోజుల జాయినింగ్ సమయం లభిస్తుంది. అది నాకు అందలేదు. నాకు రైలు టికెట్ కూడా ఇవ్వలేదు. అయినా కూడా నేను వెళ్లి 41 బెటాలియన్‌లో చేరాను, ఇంటర్వ్యూ జరిగింది. నా వివాహం గురించి నేను వారికి అన్నీ చెప్పాను. నా బదిలీ గురించి డైరెక్టర్ జనరల్‌కు కూడా రాశాను అని మునీర్‌ అన్నారు. తన తొలగింపు తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని మునీర్ అన్నారు. “ఒక జవాన్‌గా నాకు న్యాయం జరగాలని ప్రధానమంత్రి (నరేంద్ర మోడీ), హోంమంత్రి (అమిత్ షా) లకు విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. నేను 2024లో వివాహం చేసుకున్నాను, 2022 నుండి నేను విషయాన్ని అధికారులకు తెలియజేస్తున్నాను. చెప్పండి, ఇందులో అక్రమం ఎక్కడ ఉంది?” అని మునీర్‌ ప్రశ్నించారు.