రోడ్లపై చిత్ర విచిత్రమైన వస్తువులు, వాహనాలను చూడటం సర్వసాధారణం. కానీ, రద్దీగా ఉండే రహదారిపై యుద్ధ ట్యాంక్‌ను చూడడం మాత్రం ఖచ్చితంగా అసాధారణ విషయంగానే చెప్పాలి. కానీ, ఒక చోట మాత్రం భారీ యుద్ధ ట్యాంకర్ రహదారిపై ప్రత్యక్షమైంది. అది చూసిన స్థానికులు ఒకింత ఆశ్చర్యంతో పాటు షాక్ అయ్యారు. ఆర్మీకి చెందిన వాహనాలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించిన వీడియోలను గతంలో చాలా సందర్భాల్లో చూశాం. సైన్యానికి చెందిన వివిధ యుద్ధ నౌకలను, ఇతర భాగాలను భారీ కాన్వాయ్‌ని ఉపయోగించి ఆర్మీ తరలిస్తుంది. అలానే సిబ్బంది, పరికరాలు ఇతర అవసరమైన వస్తువులను రవాణా చేయడానికి భారీ వాహనాలను ఉపయోగిస్తారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతంలోని ఆర్మీ స్థావరాలకు వీటిని తరలించడం కోసం రోడ్డు మార్గం ద్వారా భారీ వాహనాలతో తరలిస్తారు. అధిక బరువు కలిగిన వాటిని ఎక్కువ దూరం పంపాలంటే మాత్రం ఇండియన్ ఆర్మీ రైలు మార్గాన్ని ఉపయోగిస్తుంది. రద్దీగా ఉండే హైవేపై పాడుబడిన ఇండియన్ ఆర్మీ ట్యాంకర్ కనిపించటం అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది.
ఈ ఘటన దేశ రాజధానికి సమీపంలో ఉన్న కుండ్లి-మనేసర్-పల్వాల్ (కెఎంపి) ఎక్స్‌ప్రెస్‌వేపై కనిపించింది. కెఎంపీ రహదారిపై యుద్ధ ట్యాంక్ చిక్కుకుపోయిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆకస్మత్తుగా ఎక్స్‌ప్రెస్ వేపై ట్యాంక్ ఎలా వచ్చిందా అని వాహనదారులు ఆశ్చర్య పోతున్నారు. నరేంద్ర యాదవ్ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ హైవేపై ఆర్మీ ట్యాంకును చూసిన నరేంద్ర యాదవ్ వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియో రికార్డ్ చేసిన వ్యక్తి ఏమి జరుగుతుందో చూడటానికి ట్యాంక్ దగ్గరకు వెళ్లి పరిశీలిస్తాడు. వీడియో రికార్డ్ చేసిన వ్యక్తి తన స్నేహితుడితో మాట్లాడుతున్న సంభాషణ కూడా రికార్డు అయ్యింది.
అయితే ఈ ట్యాంకుకు సమీపంలో ఆర్మీ అధికారులు, సిబ్బంది ఎవరూ లేకపోవడంతో మరింత అనుమానాస్పదంగా కనిపించింది. ట్యాంక్ ముందు దాని ధ్వంసమైన గుర్తులు, రోడ్డు స్వల్పంగా దెబ్బతిన్న విజువల్స్ కూడా కనిపించాయి. అయితే ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగిందా..? లేక దీనిని తరలించే వాహనంలో ఏదైనా సాంకేతిక లోపంతో ఇక్కడే వదిలి వెళ్లారా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే ఈ ట్యాంకును తరలిస్తుండగా ట్రక్కు నుంచి కిందపడి ఉండొచ్చని కొందరు అంచనాకు వచ్చారు.
అంబాలా నుంచి చెన్నైకి ఆర్మీ ట్యాంకులతో వెళ్తున్న ట్రక్కు కేఎంపీ ఎక్స్‌ప్రెస్ వే మీదుగా వెళ్తున్నట్లు తెలిసింది. ట్రక్కు అసౌదా టోల్ ప్లాజా సమీపంలో ఉండగా ట్రక్కు ప్రమాదానికి గురవ్వడంతో ట్రక్కు కింద పడిపోయినట్లు దీనిని ఆర్మీ ధృవీకరించింది. కాగా, ఈ ప్రమాందలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. రోడ్డుపై ట్యాంకు ఎక్కువ స్థలాన్ని ఆక్రమించడంతో కొద్దిసేపు రద్దీ ఏర్పడింది. ప్రమాదం జరిగిన వెంటనే అసువాడ పోలీస్ స్టేషన్ కు చెందిన అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరుక్కుపోయిన ఆర్మీ ట్యాంకును తరలించినట్టుగా సమాచారం.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..