Indian Army Acquires Land: చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వాస్తవాధీన రేఖ వెంబడి అరుణాచల్ ప్రదేశ్‌లో కొంత భూమిని భారత్ దేశ రక్షమంత్రిత్వశాఖ సేకరించింది. చైనా చొరబాట్లను నిరోధించేందుకు ఈ భూమిలో మిలటరీ గారిసన్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఎల్‌ఏసీ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న యోర్ని-2గ్రామంలోని భూమిని రక్షణ మంత్రిత్వశాఖ సేకరించింది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని వెస్ట్ సియాంగ్ జిల్లాలో ఉన్న ఈ గ్రామం .. ఇక్కడ సేకరించిన భూమిలో మిలటరీ గారిసన్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది.
సామ్రాజ్యవాద కాంక్షతో యథేచ్చగా వ్యవహరిస్తున్న చైనాను ధీటుగా తిప్పికొట్టేందుకు వ్యూహాత్మకంగా భారత ప్రభుత్వం ఈ చర్యకు దిగింది. న్యింగ్‌చిలో మౌలిక సదుపాయాలను చైనా పెంచుతోంది. చైనాను ఎదుర్కొనడానికి భారత్ సర్కార్ ఈ భూమిని సేకరించింది.
గ్రామసభ సమావేశం అవసరం లేకుండా రక్షణ, రైల్వేలు, కమ్యూనికేషన్ల కోసం భూమిని సేకరించే అధికారం భూ సేకరణ పునరావాసం, పునః పరిష్కారంలో న్యాయమైన నష్టపరిహారం, పారదర్శకత చట్టం, 2013 ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఈ భూమిని సేకరించేందుకు సముచిత అధికార వ్యవస్థగా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంటూ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఈ చట్టం ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.