
భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్‌పై భారత్, జపాన్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రాజెక్ట్ ఆలస్యం కావడానికి భారత అధికారులు, మంత్రుల వైఖరే కారణమంటూ జపాన్ మాజీ న్యాయశాఖ మంత్రి హిడెకి మకిహారా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ ఆరోపణలను భారత ప్రభుత్వం ఖండించింది. ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగుతోందని, భారత్–జపాన్ మధ్య చర్చలు సజావుగా కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది.
జూలై 15న జపాన్‌కు చెందిన ఓ వ్యాపార ప్రచురణలో వెలువడిన అభిప్రాయ కథనంపై స్పందిస్తూ.. మకిహారా సోషల్ మీడియా వేదిక Xలో తన అభిప్రాయాలను వెల్లడించారు. ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌లో తాను ప్రత్యక్షంగా పాల్గొన్నానని పేర్కొన్న ఆయన, అంతర్జాతీయ సమావేశాల్లో భారత పక్షం పలుమార్లు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని ఆరోపించారు. “చర్చల్లో భారత అధికారుల నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపించింది. వారు ఇచ్చిన హామీలను తరచుగా మార్చుకున్నారు” అంటూ మకిహారా వ్యాఖ్యానించారు. ప్రాజెక్ట్ ఆలస్యానికి పూర్తిగా భారత పక్షమే కారణమని తాను నమ్ముతున్నట్లు తెలిపారు. అలాగే చర్చల్లో అధికారులు దేశ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలను ముందుకు తెచ్చారని ఆరోపించారు.
అయితే మకిహారా వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆయన వాదనలను తిరస్కరించారు. ఈ వ్యాఖ్యలు ఒక వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని, వాస్తవ పరిస్థితులకు అవి విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. “ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్‌పై భారత్, జపాన్ మధ్య చర్చలు సానుకూలంగా సాగుతున్నాయి. నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. తొలి దశ సేవలను 2027 ఆగస్టు 15న ప్రారంభించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి” అని జైస్వాల్ వెల్లడించారు.
జైస్వాల్ వీడియో ఇక్కడ చూడండి..
జపాన్ రైల్వే ఇంజనీర్, ఢిల్లీకి చెందిన మెట్రో వాహన సలహాదారు ఇసావో సుజిమురా రాసిన అభిప్రాయ వ్యాసం ఈ వివాదానికి కారణమైంది. జపాన్ ప్రసిద్ధ షింకన్సెన్ హైస్పీడ్ రైలు నమూనా నుంచి భారత ప్రాజెక్ట్ కొంత దూరమైందని ఆయన పేర్కొన్నారు. 2017లో అహ్మదాబాద్‌లో జరిగిన శంకుస్థాపన కార్యక్రమం సమయంలో భారత్–జపాన్ భాగస్వామ్యంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయని సుజిమురా గుర్తు చేశారు. అయితే 2023లో రైలు సేవలు ప్రారంభించాలన్న అసలు లక్ష్యం ఆచరణలో సాధ్యం కాదని అధికారులకు ముందే తెలుసని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రాజెక్ట్‌లో కీలకమైన సిగ్నలింగ్ వ్యవస్థ నుంచి జపాన్‌ను పక్కన పెట్టారనే ఆరోపణలు కూడా తెరపైకి వచ్చాయి. దీనిని భారత ప్రభుత్వం ఖండించింది. సిగ్నలింగ్ పరికరాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆర్డర్ చేశామని, ఈ అంశంపై జపాన్ నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదని జైస్వాల్ తెలిపారు.
508 కిలోమీటర్ల బుల్లెట్ రైలు ప్రాజెక్ట్
ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్ భారతదేశపు తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్. మొత్తం 508 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం మహారాష్ట్ర, గుజరాత్, దాద్రా అండ్ నగర్ హవేలీ ప్రాంతాల మీదుగా సాగుతుంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ను అహ్మదాబాద్‌తో అనుసంధానం చేస్తుంది. ఈ మార్గంలో మొత్తం 12 స్టేషన్లు ఉండనున్నాయి. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడిచేలా ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం ఎనిమిది గంటల వరకు పడుతున్న ప్రయాణ సమయం భవిష్యత్తులో దాదాపు రెండు గంటలకు తగ్గే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుకు జపాన్ ప్రభుత్వానికి చెందిన జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (JICA) ఆర్థిక సహాయం అందిస్తోంది. జపాన్ షింకన్సెన్ సాంకేతికత ఆధారంగా ట్రాక్ వ్యవస్థలు, భద్రతా ప్రమాణాలు, రైలు నిర్వహణ విధానాలను అమలు చేస్తున్నారు.
పనుల్లో వేగం పెరిగిందన్న భారత్
భూసేకరణ సమస్యలు, పరిపాలనా అనుమతుల కారణంగా గతంలో ఆలస్యం ఎదురైనా, ప్రస్తుతం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. గుజరాత్‌లోని సూరత్–బిలిమోరా మధ్య మొదటి విభాగంలో సేవలు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఢిల్లీ, వారణాసి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలను కలుపుతూ హైస్పీడ్ రైలు నెట్‌వర్క్‌ను విస్తరించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. జపాన్ మాజీ మంత్రి వ్యాఖ్యలు భారత్–జపాన్ మౌలిక సదుపాయాల భాగస్వామ్యంపై చర్చకు దారితీసినా, ప్రాజెక్ట్ పనులు మాత్రం కొనసాగుతున్నాయని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. బుల్లెట్ రైలు ప్రయాణం ఎప్పుడు ప్రారంభమవుతుందనే అంశంపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..