
సరిగ్గా రెండు రోజుల క్రితం జూన్ 24న సంభవించిన వరుస భూకంపాలు దక్షిణ అమెరికా దేశమైన వెనుజులాను పూర్తిగా కుదేలు చేశాయి. రిక్టర్ స్కేల్‌పై 7.2, 7.5 తీవ్రతతో వచ్చిన ఈ రెండు శక్తివంతమైన భూకంపాలు ఆ దేశాన్ని అక్షరాలా శ్మశానంగా మార్చాయి. ఇది వెనుజులా చరిత్రలోనే గత 100 ఏళ్లలో సంభవించిన అతిపెద్ద విపత్తుగా నమోదైంది. ఈ విపత్కర పరిస్థితుల్లో వెనుజులా ప్రభుత్వం దేశంలో అత్యవసర స్థితిని ప్రకటించింది.
శవాల దిబ్బగా మారిన నగరాలు
భూకంప తీవ్రతకు వెనుజులా రాజధాని కరాకస్‌తో పాటు పలు నగరాల్లోని వందలాది భవనాలు, ఇళ్లు, హోటళ్లు శిథిలాల గుట్టలుగా మారాయి. లా గ్వైరా ప్రాంతంలో తీవ్ర నష్టం వాటిల్లింది. ఇక్కడి ఉత్తర తీర ప్రాంతంలో దాదాపు 100 నుండి 250 భవనాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. మైకెటియా అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రధాన రహదారులు, విద్యుత్ సరఫరా వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఫాల్కాన్, మిరాండా, మారకే, వాలెన్సియా ప్రాంతాల్లో కూడా భారీ నష్టం వాటిల్లింది.
ఇప్పటివరకు 235 మంది మరణించగా, 4,300 మందికి పైగా గాయపడ్డారు. సుమారు 40 నుండి 50 వేల మంది ప్రజలు ఇంకా శిథిలాల కింద ఆచూకీ లేకుండా పోయారు. ఈ ప్రమాదంలో 70 వేలకు పైగా కుటుంబాలు వీధిన పడ్డాయి. అయితే, మరణాల సంఖ్య 10 వేల నుండి లక్ష వరకు ఉండవచ్చని, వేల కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం జరిగి ఉండవచ్చని అంతర్జాతీయ సంస్థ USGS అంచనా వేసింది.
‘ఆపరేషన్ అమిస్టాడ్’తో భారత్ ఆపన్న హస్తం
ఈ క్లిష్ట సమయంలో మిత్రదేశమైన వెనుజులాను ఆదుకునేందుకు భారతదేశం తక్షణమే స్పందించింది. ‘ఆపరేషన్ అమిస్టాడ్’ (స్పానిష్ భాషలో అమిస్టాడ్ అంటే ‘స్నేహితుడు’ అని అర్థం) ప్రారంభించింది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాట్లాడుతూ, విపత్తు సమయంలో వెనుజులా ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు అండగా నిలవడానికి భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Operation Amistad underway!
Two @IAF_MCC C17s took-off today for Venezuela with urgent assistance to support their post-earthquake relief efforts.
The assistance contains an Indian Army @adgpi Field Hospital Unit and over 35 tons of relief supplies, medicines and medical… pic.twitter.com/Dcq8P065tp
— Dr. S. Jaishankar (@DrSJaishankar) June 26, 2026
భారత వైమానిక దళానికి చెందిన రెండు భారీ C-17 గ్లోబ్‌మాస్టర్ విమానాలు 35 టన్నులకు పైగా అత్యవసర సహాయక సామగ్రితో వెనుజులాకు బయలుదేరి వెళ్లాయి. ఈ రవాణాలో ముఖ్యంగా భారత సైన్యానికి చెందిన ఒక ప్రత్యేక ‘ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్’ ఉంది. అత్యవసర వైద్య మందులు, అత్యాధునిక వైద్య పరికరాలు, విపత్తు సమయాల్లో ప్రాణాలు కాపాడే రెండు ప్రతిష్టాత్మక ‘భీష్మ్ క్యూబ్స్’ (BHISHM Cubes) మొబైల్ ఆసుపత్రులు ఉన్నాయి.
OPERATION AMISTAD: INDIA DEPLOYS SPECIALISED INDIAN ARMY MEDICAL CONTINGENT TO EARTHQUAKE-HIT VENEZUELA
'Compartimos su dolor. Estamos con ustedes.'
Responding swiftly to the devastating earthquake in northern Venezuela, #India has launched Operation Amistad, deploying a… pic.twitter.com/Yg1m58CCho
— ADG PI – INDIAN ARMY (@adgpi) June 26, 2026
భూకంప బాధితులకు తక్షణ అత్యవసర వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా భారత్ పంపిన ఈ సామగ్రి, ప్రస్తుతం అక్కడ ముమ్మరంగా సాగుతున్న రెస్క్యూ ఆపరేషన్లలో బాధితులకు చాలా పెద్ద ఊరటనిస్తుందని భావిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…