
భారత సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శనివారం (మే 30) సంచలన వ్యాఖ్యలు చేశారు. శత్రు దేశాల కుతంత్రాలను తిప్పికొట్టేందుకు, దేశ రక్షణే ధ్యేయంగా భారత్ ‘ఆపరేషన్ సింధూర్ 2.0’కు సన్నద్ధమవుతోందని ఆయన స్పష్టం చేశారు. కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ చర్యలకు ప్రతిస్పందనగా భారత్ అవలంబించిన కఠిన సైనిక వైఖరి ఇంకా కొనసాగుతూనే ఉందని ఆయన తెలిపారు.
మీడియా సంస్థ ‘ఏఎన్ఐ’తో మాట్లాడిన జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోంది అని స్పష్టం చేశారు. ప్రస్తుత సరిహద్దు పరిస్థితిని ఆయన తాత్కాలిక ఘర్షణల విరమణగా అభివర్ణించారు. పాకిస్థాన్ పేరును నేరుగా ప్రస్తావించకుండానే శత్రుదేశానికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ భవిష్యత్తులో కొత్త ఆపరేషన్ చేపట్టాల్సి వస్తే, కేవలం ఆర్మీ మాత్రమే కాకుండా ఎయిర్ ఫోర్స్, నావికా దళాలు సైతం ఉమ్మడిగా దాడికి సిద్ధంగా ఉన్నాయని ఆయన వివరించారు. తదుపరి యుద్ధం కోసం త్రివిధ దళాలు 24గంటలు సన్నద్ధతతో ఉన్నాయని, వాటి మధ్య సమన్వయాన్ని మరింత పెంపొందిస్తున్నామని తెలిపారు.
ఆధునిక యుద్ధ తంత్రం గురించి మాట్లాడుతూ.. “ప్రస్తుత రోజుల్లో యుద్ధభూమి చాలా పారదర్శకంగా మారింది, మన ప్రతి కదలిక అవతలి వారికి తెలిసిపోతుంది. అందువల్ల సరిహద్దు ప్రాంతాల్లో మన సైనికులను, పౌరులను రక్షించడానికి అవసరమైన వ్యూహాత్మక రక్షణ, సైన్య మోహరింపు విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి” అని ఆర్మీ చీఫ్ పేర్కొన్నారు.
అంతేకాకుండా, కేవలం సరిహద్దుల్లోనే కాకుండా సమాచార యుద్ధంలో గెలవడం కూడా అంతే ముఖ్యమని ఆయన అన్నారు. దేశం మొత్తం ఏకమై, అధికారిక సమాచారాన్ని విశ్వసించినప్పుడే సమాచార యుద్ధంలో విజయం సాధించగలమని, అలాంటి ఐక్యత ఉన్న దేశం ఎల్లప్పుడూ యుద్ధంలో గెలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
అసలేమిటి ఈ ఆపరేషన్ సింధూర్?
గత ఏడాది, అంటే 2025 మే 7 – మే 8 మధ్య రాత్రి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి బలమైన ప్రతీకారంగా భారతదేశం ‘ఆపరేషన్ సింధూర్’ను ప్రారంభించింది. అంతకుముందు ఏప్రిల్ 22న కాశ్మీర్‌లోని పహల్గామ్, బైసారన్ లోయలో పాకిస్థాన్ మద్దతుగల ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఉగ్రదాడికి గట్టి బుద్ధి చెప్పడానికే భారత సైన్యం ఈ ఆపరేషన్ చేపట్టింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా పార్ట్-2 ఆపరేషన్ సింధూర్ 2.0కు కూడా త్రివిధ దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని ఆర్మీ చీఫ్ ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..