
పేదలకు ఎంతో నమ్మకమైన సంస్థగా ఉన్న ఇండియా పోస్ట్ కొత్త రికార్డులు క్రియేట్ చేసినట్లు కేంద్ర కేంద్ర సమాచార, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. ఆయన అధ్యక్షతన 2026–27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి సంబంధించిన ఇండియా పోస్ట్ వ్యాపార సమీక్షా సమావేశం జరిగింది. సమావేశం అనంతరం మంగళవారం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి, ఇండియా పోస్ట్ చరిత్రలోనే తొలిసారిగా రెండంకెల వృద్ధిని నమోదు చేసి కొత్త మైలురాయిని చేరుకుందని వెల్లడించారు. మంత్రి తెలిపిన వివరాల ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోలిస్తే ఇండియా పోస్ట్ మొత్తం టర్నోవర్ 22.2 శాతం పెరిగింది. గత ఏడాది తొలి త్రైమాసికంలో రూ.3,280 కోట్లుగా ఉన్న టర్నోవర్, ఈసారి రూ.4,008 కోట్లకు చేరింది. అదే సమయంలో మొత్తం ఆదాయం కూడా గణనీయంగా పెరిగి రూ.13,218 కోట్ల నుంచి దాదాపు రూ.15,500 కోట్లకు చేరిందని, ఇది సుమారు 20 శాతం వృద్ధిని సూచిస్తుందని ఆయన తెలిపారు.
A historic quarter for @IndiaPostOffice…
An absolute delight to share that India Post has achieved its highest-ever Q1 turnover of ₹4,008.95 crore in FY 2026-27, registering an impressive 22.2% growth over Q1 of FY 2026 and crossing the ₹4,000 crore milestone for the first… pic.twitter.com/A5sc1sVq3O
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) July 14, 2026
చారిత్రాత్మకంగా ఇండియా పోస్ట్ వార్షిక వృద్ధి సాధారణంగా 1 నుంచి 2.5 శాతం మధ్యే ఉండేదని, అయితే గత ఏడాది నుంచి సంస్థ పనితీరులో గణనీయమైన మార్పు కనిపిస్తోందని సింధియా పేర్కొన్నారు. రెండేళ్లుగా నమోదవుతున్న ఈ వృద్ధి దేశవ్యాప్తంగా తపాలా సేవల విస్తరణ, సాంకేతిక ఆధునీకరణకు నిదర్శనమని ఆయన అన్నారు. ఈ ఏడాదికి కూడా ఇండియా పోస్ట్ ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించుకుందని మంత్రి వెల్లడించారు. పార్శిల్ సేవలను మరింత ఆధునీకరించడం, సేవల వేగాన్ని పెంచడం, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సేవలను విస్తరించడం ప్రధాన లక్ష్యాలుగా నిర్ణయించినట్లు తెలిపారు.
సమావేశంలో ఈ-కామర్స్ రంగానికి అనుగుణంగా పార్శిల్ డెలివరీ వ్యవస్థను మరింత బలోపేతం చేసే అంశాలపై కూడా చర్చ జరిగింది. ఈ క్రమంలో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, షిప్‌రాకెట్‌లతో భాగస్వామ్యాన్ని మరింత విస్తరించే దిశగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ భాగస్వామ్యాల ద్వారా దేశవ్యాప్తంగా పార్శిల్ డెలివరీ సామర్థ్యం పెరుగుతుందని, వినియోగదారులకు మరింత వేగవంతమైన సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అలాగే పౌరులకు అందించే తపాలా సేవలు, ఆర్థిక సమ్మిళిత కార్యక్రమాల్లో కూడా గణనీయమైన పురోగతి నమోదైందని సింధియా పేర్కొన్నారు. డిజిటల్ సేవలు, గ్రామీణ ప్రాంతాల్లో తపాలా సేవల విస్తరణ, ఈ-కామర్స్ మద్దతుతో ఇండియా పోస్ట్‌ను ఆధునిక సేవా సంస్థగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి