దేశ వ్యాప్తంగా నిత్యం వందల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వేలాది మంది ఈ ప్రమాదాల్లో అసువులు బాసుతున్నారు. ఈక్రమంలో వాహనదారుల భద్రతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం (Central Government) ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రతిపాదనలు, నిబంధనలు తీసుకొస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరిలో అన్ని కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అక్టోబర్ ఒకటి నుంచి ఈ కొత్త నిబంధనలు అమలవుతాయని పేర్కొంది. కేవలం ఒక నెలలోనే దీనికి సంబంధించిన విధివిధానాలపై కేంద్రం నుంచి ప్రకటన వస్తుందని చాలామంది భావించారు. అయితే ఈ నిర్ణయం వల్ల కార్ల ధరలు మరింత పెరుగుతాయని , దాని వల్ల కొనుగోలుదారులు దూరమయ్యే అవకాశం ఉందని తయారీ సంస్థలు కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ ప్రకటన ఆలస్యమవుతూ వస్తోంది. అయితే ప్రయాణికుల భద్రతలో రాజీపడే ప్రసక్తే లేదని తాజాగా కేంద్రం స్పష్టం చేసింది. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కొత్త నిబంధనలు పెడుతున్నామన్న కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) కార్లలో ఆరు బ్యాగ్‌ల అంశంపై స్పందించారు.
అందుకే ఆలస్యం..
ప్రమాద సమయాల్లో కార్లలో ఎయిర్‌బ్యాగులు ఉన్నట్లయితే కేవలం ఒక్క ఏడాదిలోనే 13 వేల మంది ప్రాణాలను కాపాడి ఉండేవాళ్లమని గడ్కరీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈక్రమంలో కార్లలో ఆరు ఎయిర్ బ్యాగ్‌ల ఏర్పాటు అంశాన్ని రవాణా శాఖ నోటిఫై చేసిందన్న ఆయన.. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని ప్రకటించారు. మరోవైపు దీనికి సంబంధించిన విధివిధానాలకు తుది రూపు తెచ్చే పనిలో నిమగ్నమైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా ఇప్పటికే అన్ని కార్లలో 2 ఎయిర్‌బ్యాగ్‌ల (డ్రైవరు, ముందు సీటు ప్రయాణికునికి) ఏర్పాటు తప్పనిసరిగా ఉండగా.. మరో నాలుగు ఎయిర్ బ్యాగ్స్ ఏర్పాటు వల్ల వినియోగదారుడికి అదనంగా 75 డాలర్ల కంటే ఎక్కువ ఖర్చు కాదని ప్రభుత్వం చెబుతోంది. అయితే కార్ల తయారీ సంస్థలు మాత్రం ఇందుకు 231 డాలర్ల అదనపు ఖర్చు అవుతుందని పేర్కొంటున్నాయి. అయితే తయారీ సంస్థల వాదనను తోసిపుచ్చింది కేంద్ర ప్రభుత్వం. ‘విదేశాలకు ఎగుమతి చేసే కార్లకు అదనపు ఎయిర్ బ్యాగ్‌లను అమర్చుతున్నప్పటికీ దేశీయంగా అమ్ముతున్న వాటిలో మాత్రం వాటిని ఏర్పాటు చేయడం లేదు’ అని మండిపడింది. నిజానికి తయారీ సంస్థలే ఎయిర్ బ్యాగ్‌లను అందించాల్సి ఉన్నప్పటికీ వారు ముందుకు రాకపోవడంతో ఈ కొత్త నిబంధనలు తీసుకురావాల్సి వస్తుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
Telangana: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌ని ఢీకొట్టిన కారు.. ఫ్యామిలీ మొత్తం..!