బిన్ లాడెన్ హిట్‌లిస్ట్‌లో భారత్.. రహస్య పత్రాలను బయటపెట్టిన అమెరికా సీఐఏ..

ప్రపంచాన్నే వణికించిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఒసామా బిన్ లాడెన్ ఉగ్ర కుట్రల్లో భారత్ కూడా ఉందా? 9/11 మారణహోమానికి ముందే మన దేశాన్ని టార్గెట్ చేయాలని అల్ ఖైదా ప్లాన్ చేసిందా? దాదాపు 28 ఏళ్ల నాటి అత్యంత రహస్య డాక్యుమెంట్లను అమెరికా నిఘా సంస్థ సీఐఏ ఇప్పుడు బహిర్గతం చేసింది. ఆ పత్రాల్లోని నిజాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

బిన్ లాడెన్ హిట్‌లిస్ట్‌లో భారత్.. రహస్య పత్రాలను బయటపెట్టిన అమెరికా సీఐఏ..
India On Osama Bin Laden Hit List

Updated on: Sep 13, 2026 | 9:47 AM

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా వ్యవస్థాపకుడు, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఒసామా బిన్ లాడెన్ ఒకప్పుడు భారత్‌పై కూడా ఉగ్ర దాడులు చేయాలని కుట్ర పన్నినట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇటీవల బయటపెట్టిన రహస్య పత్రాల్లో ఈ దిగ్భ్రాంతికర వివరాలు వెల్లడయ్యాయి. 2001 సెప్టెంబర్ 11న న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిగిన 9/11 ఉగ్ర దాడులకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, బిన్ లాడెన్‌కు సంబంధించిన 70కి పైగా ప్రెసిడెన్షియల్ ఇంటెలిజెన్స్ బ్రీఫ్‌లను సీఐఏ అధికారికంగా విడుదల చేసింది. 1998 ఆగస్టు 28 నాటి ప్రెసిడెన్షియల్ మెమో ప్రకారం.. అమెరికా ప్రయోజనాలతో పాటు భారత్‌తో సహా పలు దేశాలపై దాడులు జరపాలని లాడెన్ వ్యూహరచన చేసినట్లు నమోదై ఉంది. ‘‘బిన్ లాడెన్ టెర్రరిస్ట్ నెట్‌వర్క్ స్టిల్ ఎ థ్రెట్’’ పేరిట రూపొందించిన ఈ నివేదికలో భారత్‌తో పాటు పాకిస్తాన్, ఈజిప్ట్, కువైట్, సౌదీ అరేబియా, యెమెన్, ఉగాండా, నైజీరియాలను కూడా లక్ష్యంగా చేసుకోవాలని భావించినట్లు తెలిపారు. అయితే ఈ డాక్యుమెంట్‌లో సమాచార మూలాలను గోప్యంగా ఉంచడంతో పాటు భారత్‌లోని ఏ ప్రాంతంపై, ఏ తేదీన దాడి చేయాలనే కచ్చితమైన కార్యాచరణ ప్రణాళికను మాత్రం సీఐఏ నమోదు చేయలేదు.

ఆఫ్ఘనిస్తాన్‌లోని అల్ ఖైదా స్థావరాలపై అమెరికా క్షిపణి దాడులు చేసినప్పటికీ బిన్ లాడెన్‌తో సహా కీలక ఉగ్రవాద నేతలు ప్రాణాలతో బయటపడ్డారని, వారి కమ్యూనికేషన్ నెట్‌వర్క్ చెక్కుచెదరకుండా ఉందని సీఐఏ ఆ నివేదికలో విశ్లేషించింది. కొన్ని క్యాంపులలో ఉగ్రవాద శిక్షణను యథావిధిగా కొనసాగిస్తూ, మరికొన్నింటిని సురక్షిత ప్రాంతాలకు మార్చారు. అమెరికా క్షిపణి దాడులకు కొద్ది గంటల ముందే అమెరికాతో పాటు బ్రిటన్‌పై కూడా తక్షణ దాడులకు లాడెన్ సన్నాహాలు చేసినట్లు వెల్లడైంది. ఉత్తర అమెరికా, యూరప్, తూర్పు ఆసియా ప్రాంతాల్లో బలమైన మౌలిక వసతులు ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా కనీసం 60 దేశాల్లో విస్తరించిన అనుబంధ గ్రూపుల ద్వారా విధ్వంసం సృష్టించే సామర్థ్యం అతనికి ఉందని ఆనాడే ఇంటెలిజెన్స్ హెచ్చరించింది.

అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్‌ల హయాంలో 1998 నుంచి 2001 మధ్య అమెరికాపై భారీ ఉగ్ర ముప్పు పొంచి ఉందని సీఐఏ పదేపదే హెచ్చరించినట్లు ఈ పత్రాల ద్వారా స్పష్టమవుతోంది. దేశ చరిత్రలోనే అత్యంత చీకటి రోజైన 9/11 నాటి విమానాల హైజాకింగ్, ట్విన్ టవర్ల కూల్చివేతకు దారితీసిన పరిస్థితులపై పారదర్శకతను చాటేందుకే ఈ సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేసినట్లు సీఐఏ స్పష్టం చేసింది. దాదాపు మూడు దశాబ్దాల క్రితమే అంతర్జాతీయ ఉగ్రవాద మూలాలు భారత్‌ను కూడా తమ విస్తరణ లక్ష్యాల్లో చేర్చాయన్న వాస్తవం ఈ పత్రాల ద్వారా మరోసారి ధ్రువీకరణ అయ్యింది.

Loading...
Unable to load recommendations.
Follow Us