
ఉత్తర వజీరిస్తాన్‌లో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 13 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. అయితే దీనిపై భారతదేశాన్ని నిందించేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ తీరుపై కేంద్రం తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో జరిగిన ఈ దాడిలో 13మంది ప్రాణాలు కోల్పోగా, 24 మంది గాయపడ్డారు.
దాడి జరిగిన కొద్దిసేపటికే, పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ నుండి అధికారిక ప్రకటన భారతదేశాన్ని ఆత్మాహుతి బాంబు దాడికి నిందించింది. అయితే, పాకిస్తాన్ తాలిబన్ అనుబంధ సంస్థ హఫీజ్ గుల్ బహదూర్ ఈ ప్రాణాంతక దాడికి బాధ్యత వహించినట్లు ప్రకటించింది. మీర్ అలీ ప్రాంతంలో వాహనంతో వచ్చిన ఆత్మాహుతి దాడిదారుడు భద్రతా దళాల కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకున్నాడు. ఆ తర్వాత కాన్వాయ్ ప్రధాన వాహనం అడ్డగించింది. ఈ దాడిలో 14 మంది పౌరులు సహా కనీసం 24 మంది సిబ్బంది గాయపడ్డారు. ఈ దాడికి భారతదేశాన్ని నిందించడానికి ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ సైన్యం అధికారిక ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఒక ప్రకటనలో తెలిపింది.
ఆత్మాహుతి బాంబు దాడితో భారత్‌ను అనుసంధానిస్తూ పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారతదేశం తోసిపుచ్చింది . “జూన్ 28న వజీరిస్తాన్‌లో జరిగిన దాడికి భారతదేశాన్ని నిందించడానికి ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ సైన్యం అధికారిక ప్రకటనను మేము చూశాము. ఈ ప్రకటనను దానికి తగిన ధిక్కారంతో మేము తిరస్కరిస్తున్నాము” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
Statement regarding Pakistan
🔗 : https://t.co/oQyfQiDYpr pic.twitter.com/cZkiqY1ePu
— Randhir Jaiswal (@MEAIndia) June 28, 2025
అయితే ఇప్పటికే పాకిస్తాన్ గిరిజన ప్రాంతాలలో హింసాకాండ పెరగడానికి మరో ఉదాహరణగా నిలిచిన ఈ దాడిని, తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP)తో జతకట్టిన హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్ ఆత్మాహుతి విభాగం ప్రకటించింది. ఈ సంఘటన ఇటీవలి నెలల్లో ఉత్తర వజీరిస్తాన్‌లో జరిగిన అత్యంత ఘోరమైన సంఘటనలలో ఒకటిగా భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో భద్రతా పరిస్థితి గురించి తీవ్రమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
2021లో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి, పాకిస్తాన్ తన సరిహద్దు ప్రాంతాల్లో దాడులలో పెరుగుదల కనిపిస్తుంది. ఈ సరిహద్దు దాడులకు కారణమైన ఉగ్రవాదులకు ఆఫ్ఘన్ తాలిబన్లు ఆశ్రయం కల్పిస్తున్నారని ఇస్లామాబాద్ తరచుగా ఆరోపిస్తోంది. ఈ ఆరోపణను కాబూల్ సైతం ఖండించింది. వార్తా సంస్థ AFP కథనం ప్రకారం, ఈ సంవత్సరం ఇప్పటివరకు ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్లలో ప్రభుత్వ వ్యతిరేక గ్రూపుల దాడుల్లో దాదాపు 290 మంది మరణించారు. వారిలో ఎక్కువగా భద్రతా దళాలు ప్రాణాలు కోల్పోయాయి. ఇదిలావుంటే, గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025లో పాకిస్తాన్ రెండవ స్థానంలో నిలిచింది. గత సంవత్సరంలో ఉగ్రవాద సంబంధిత మరణాలు 45 శాతం పెరిగి 1,081కి చేరుకున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..