అటు గాయం…ఇటు సాయం.. నేనున్నా అంటూ మయన్మార్‌కు భారత్‌ భరోసా!

|

Apr 06, 2025 | 3:57 PM

భారీ భూకంపంతో కకావికలమైన మయన్మార్‌, థాయ్‌లాండ్‌లకు భారత్‌ ఆపన్న హస్తం అందించింది. గాయపడ్డ దేశాలకు భారీ సాయం అందిస్తోంది. ఆపరేషన్‌ బ్రహ్మ పేరుతో మయన్మార్‌, థాయ్‌లాండ్‌లను ఆదుకునేందుకు అన్ని రకాలుగా నడుం బిగించింది. ఆహారం, మెడిసిన్‌తో పాటు రెస్క్యూ టీమ్స్‌ను కూడా తరలించింది.

అటు గాయం...ఇటు సాయం.. నేనున్నా అంటూ మయన్మార్‌కు భారత్‌ భరోసా!
Ins Karwar
Follow us on

మయన్మార్‌లో ఇటీవల సంభవించిన భూకంపం తీవ్ర విధ్వంసం సృష్టించింది. మయన్మార్‌లో ఎటు చూసినా మొండిగోడలు. బాధితుల ఆర్తనాదాలు. ఎటు చూసినా చావులు.. కన్నీళ్లు.. ఉన్నోళ్లకు తిండిలేదు. పోయినోళ్లకు దహనసంస్కారాలు లేవు. వందలమంది ఆచూకీ గల్లంతు. ప్రపంచమంతా కన్నీరు పెడుతోంది. కానీ సాయం చేసే చేతులే కరువైపోయాయి. కానీ భారత్ వేగంగా స్పందించింది. నేనున్నాంటూ సహాయ సామాగ్రిని యుద్ధప్రాతిపదికన బాధిత దేశానికి పంపింది భారత్. మార్చి 28న ఆపరేషన్ బ్రహ్మ పేరుతో వేగవంతమైన సహాయ, రక్షణ చర్యను ప్రారంభించింది. అలాగే అక్కడ చిక్కుకున్నభారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చింది.

మయన్మార్‌లో జరిగిన విపత్తు తర్వాత భారతదేశం సహాయం చేయడానికి పెద్ద అడుగు వేసింది. భారత నావికాదళ నౌక INS ఘడియాల్ శనివారం(ఏప్రిల్ 5) ఉదయం రంగూన్ చేరుకుంది. ఆ నౌక 405 టన్నుల బియ్యంతో సహా 442 టన్నుల సహాయ సామగ్రిని తీసుకెళ్లింది. ఈ సహాయ సామగ్రిని భారత రాయబారి అభయ్ ఠాకూర్ రంగూన్ ప్రాంత ముఖ్యమంత్రి యు సో థీన్‌కు అందజేశారు. ఈ సహాయం ఇటీవల మయన్మార్‌లో సంభవించిన ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రభావితమైన వారికి పంపిణీ చేయడం జరుగుతుంది.

హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారతదేశం మొట్టమొదటి సహాయం చేసే దేశంగా భారత్ నిలిచింది. ఈసారి భారత నావికాదళం వేగంగా పనిచేసింది. ఇప్పటివరకు 512 టన్నులకు పైగా సహాయ సామగ్రిని మయన్మార్‌కు పంపింది. దీని ద్వారా మయన్మార్ ఈ క్లిష్ట సమయం నుండి బయటపడటానికి సహాయపడుతుంది.

ప్రకృతి ప్రకోపంతో ప్రపంచంలో ఏ దేశం దెబ్బ తిన్నా…ఆదుకునేందుకు తానున్నా అంటుంది భారత్‌. అలాంటిది పొరుగునే ఉన్న మయన్మార్‌.. భారీ భూకంపంతో విలవిల్లాడితే మన దేశం చూస్తూ ఊరుకుంటుందా? వెంటనే రంగంలోకి దిగింది. మయన్మార్‌తో పాటు భూకంపం ధాటికి దెబ్బతిన్న థాయ్‌లాండ్‌కు కూడా సాయం చెయ్యడానికి నడుం బిగించింది. భూకంపంతో విలవిల్లాడిన మయన్మార్‌కు తొలిసాయం భారత్‌ నుంచే అందింది.

తొలుత ఆపరేషన్ బ్రహ్మపేరుతో మూడు స్పెషల్ విమానాల్లో సహాయక సామాగ్రిని మయన్మార్‌కు తరలించింది భారత్‌. యూపీలోని ఘజియాబాద్ ఇండస్ ఎయిర్ బేస్ నుంచి మయన్మార్ కు 15టన్నుల సహాయ మెటీరియల్‌ను తక్షణ సాయంగా పంపింది. విమానాల్లో ఆహారం,మెడిసిన్, జనరేటర్లు, టెంట్లు, బ్యాగులు, దుప్పట్లు, వాటర్ క్లీనింగ్ మెటీరియల్ పంపించారు. మయన్మార్, థాయ్‌లాండ్‌కు మరింత సాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు విదేశాంగ శాఖ అధికారులు.

మరోవైపు మయన్మార్‌లోని నేపిడాలో NDRF బృందంతో మొదటి C-130 విమానం దిగింది. ఈ బృందాన్ని భారత రాయబారి, మయన్మార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ రాయబారి మాంగ్ మాంగ్ లిన్ రిసీవ్ చేసుకున్నారు. భూకంపం తర్వాత విమానాశ్రయం పాక్షికంగా పనిచేయకపోయినా రాజధానికి రెస్క్యూ సిబ్బందిని పంపిన మొదటి దేశంగా భారత్‌ నిలిచింది. ఆ తర్వాత NDRF బృందం…సహాయక చర్యల కోసం మాండలేకు బయలుదేరి వెళ్లింది. సహాయ కార్యకలాపాల కోసం అక్కడికి చేరుకున్న మొదటి రెస్క్యూ బృందం ఇదే కావడం విశేషం.

భారత్‌ బాటలోనే ప్రపంచం మొత్తం నడుస్తోంది. మయన్మార్‌కు సాయం అందించడానికి చైనా, రష్యా, మలేషియా వంటి దేశాలు కూడా ముందుకు వచ్చాయి. చైనా రెస్క్యూ బృందాలు, పరికరాలను పంపగా, భారతదేశం 80 మంది సభ్యుల NDRF బృందాన్ని వైద్య సదుపాయాలతో పాటు పంపింది. ఇక సహాయ చర్యల కోసం 5 మిలియన్లు డాలర్లు కేటాయించింది. దక్షిణ కొరియా, ఆమెరికాతో సహా ఇతర దేశాలు కూడా సహాయాన్ని అందిస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..