ఐక్యరాజ్యసమితి డిబేట్ లో కాశ్మీర్ సమస్యను టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ లేవనెత్తడాన్ని ఇండియా తీవ్రంగా ఖండించింది. ఎర్డోగాన్ ప్రసంగం భారత ఆంతరంగిక వ్యవహారాల్లో పూర్తిగా జోక్యం చేసుకోవడమేనని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్. త్రిమూర్తి అన్నారు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని మీరు గౌరవించడం నేర్చుకోవాలన్నారు. కాగా-దక్షిణాసియాలో శాంతి, సుస్థిరతలకు కాశ్మీర్ అంశం ముడిపడి ఉందని, కానీ ఇది సమస్యగా మారిందని ఎర్డోగాన్ వ్యాఖ్యానించారు. భారత పాకిస్థాన్ దేశాలు ఈ సమస్యను ఐరాస తీర్మానాల మేరకు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. కాశ్మీరీల హక్కులను పరిరక్షించాలన్నారు.