India Bans China Apps: డ్రాగన్ కంట్రీ చైనాకు.. భారత్ దిమ్మతిరిగే షాకిచ్చింది. దేశంలో ఆపరేట్ అవుతున్న 232 చైనా యాప్‌లను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేస్తూ ఆదివారం నిర్ణయం తీసుకుంది. అంతకుముందు కూడా ఎన్నో చైనా యాప్‌లపై నిషేధం విధించిన కేంద్రం.. మరోసారి 232 యాప్‌లను కూడా బ్యాన్ చేసింది. వీటిలో 138 బెట్టింగ్ యాప్‌లు, 94 లోన్ యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఐటీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఆరునెలల క్రితమే చైనా యాప్‌లపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సిఫారసు చేసింది.
చైనా యాప్ లోన్ల పేరుతో వేధింపులకు గురిచేస్తునట్టు కేంద్ర హోంమంత్రిత్వశాఖ దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా గూఢచర్యానికి కూడా ఇవి కారణమవుతున్నట్టు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తించింది. అందుకే బ్యాన్ విధించాలని నిర్ణయించారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన సమాచారం మేరకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అత్యవసర ప్రాతిపదికన నిషేధించడానికి, బ్లాక్ చేయడానికి ప్రక్రియను ప్రారంభించిందని అధికార వర్గాలు తెలిపాయి.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆరు నెలల క్రితం 288 చైనీస్ లోన్ లెండింగ్, బెట్టింగ్ యాప్‌లపై నిఘా ప్రారంభించింది. అయితే లోన్ లెండింగ్ యాప్ లలో 94 యాప్‌లు ఇ-స్టోర్‌లలో అందుబాటులో ఉన్నాయని, మరికొన్ని థర్డ్-పార్టీ లింక్‌ల ద్వారా పనిచేస్తున్నాయని కనుగొంది. ఈ యాప్‌లు లోన్ తీసుకున్న వ్యక్తులను భారీ అప్పుల్లో బంధించడంతోపాటు.. గూఢచర్యం, ప్రచార సాధనాలుగా దుర్వినియోగం చేస్తున్నాయని.. దీంతోపాటు భారతీయ పౌరుల డేటాకు భద్రతా ప్రమాదాన్ని కలిగించవచ్చన్న నిఘా వర్గాల సమాచారంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..