
దేశమంటే మట్టికాదోయ్..దేశమంటే మనుషులోయ్..అన్నారు గురజాడ మహాకవి. మన దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశంలోని కొన్ని వారసత్వ సంపద, కట్టడాలు, సంస్కృతీ, నాటి స్వాతంత్ర్య సమరయోధులకు సంబంధించిన అపురూప జ్ఞాపకాలను తిరిగి చూద్దాం..అలా వెళితే ముందుగా జలియన్‌వాలాబాగ్..
జలియన్ వాలాబాగ్:
అమృత్‌సర్‌లో ఒక ప్రదేశం. చుట్టూ ఇళ్లతో కూడి ఉన్నఓ పెద్ద ప్లే గ్రౌండ్ లాంటిది. ఏప్రిల్ 13, 1919లో ఇక్కడి పార్క్‌లో సమావేశమైన భారతీయులపై తెల్లదొరలు జరిపిన దమనకాండకు నిదర్శనం. నిరాయుధులు, సామాన్యులపై జనరల్ డయ్యర్ ఇచ్చిన ఆదేశాల మేరకు సైనికులు రెచ్చిపోయారు. ఏకధాటిగా పదినిమిషాల పాటు కురిపించిన బుల్లెట్ల వర్షంలో వేలాదిమంది అమాయక ప్రజలు ప్రాణాలు కొల్పోయారు. భారతీయుల పై బ్రిటీష్ ప్రభుత్వం అత్యంత పాశవికంగా జరిపిన కాల్పుల తర్వాత ప్రజల్లో మరింత ఐకమత్యం పెల్లుబికింది. ఈ దారుణ ఉదాంతం భారతీయుల స్వాతంత్ర్య కాంక్షను అణచలేకపోయింది. ఉద్యమం మరింత ఎగసింది. ఫలితంగా 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం లభించింది. వేలాది మంది అమరవీరుల ప్రాణత్యాగాలతో భారత్ ఏర్పడింది. ఆనాటి రక్తపు మరకలకు నిదర్శనంగా నిలిచే.. జలియన్‌వాలాబాగ్ పార్క్, అందులోని బావి, ఎత్తైన స్తూపం ప్రతి ఒక్క భారతీయుడు సందర్శించి తీరాల్సిన సజీవ సాక్ష్యాలు. తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడి కి నేరుగా రైలు, విమాన సౌకర్యాలు లేవు. ఢిల్లీ నుండి 450కి.మీ, చంఢీగడ్ నుండి 225 కి.మీ వెళ్లి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఇక్కడకు చేరుకోవచ్చు.
ఝాన్సీ లక్ష్మీబాయి:
భారత దేశం గాఢ అంధకారంలో ఉన్నప్పుడు ఒక మెరుపులా ప్రకాశించి మాయమైన వీర వనిత. సైనికుల కోరిక మేరకు పోరాటంలోకి దిగిన ఆమె గ్వాలియర్‌లో యుద్ధం చేస్తూ..1858 జూన్ 17న వీరమరణం పొందింది. భారతదేశపు “జోన్‌ఆఫ్ ఆర్క్’గా ప్రశంసలందుకున్న లక్ష్మీబాయి కథ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమై, ఇప్పటికీ స్పూర్తిదాయకంగా నిలుస్తోంది. లక్ష్మీబాయి పరాక్రమానికి చిహ్నాలైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. “రాణీ ఝాన్సీకా ఖిలా’గా ప్రసిద్దమైన, సుమారు 400 ఏళ్ల నాటి ఝాన్సీ కోట, రాణిమహల్, ఝాన్సీ లక్ష్మీబాయి, మహాత్మ గాంధీల పేరుమీద ఏర్పాటు చేసిన మ్యూజియంలు తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశాలు. అయితే, ఇక్కడకు చేరుకోవాలంటే..దక్షిణ మధ్య రైలు మార్గంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి రాంచీ జంక్షన్‌కు పలు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. రాంచీ విమానాశ్రయం నుంచి సుమారు 102 కి.మీ దూరం ప్రయాణిస్తే ఇక్కడి చేరుకోగలం.
కోల్‌కత్తాలోని నేతాజీ భవన్:
భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్, నేతాజీ భవన్ జీవితానికి అంకితమైన మ్యూజియం, లైబ్రరీ ఉంది. వీటిని కూడా తప్పక సందర్శించాల్సిన అవసరం ఎంతైన ఉంది. నేతాజీ వారసులకు సంబంధించిన ఇంటిలోనే వీటిని ఏర్పాటు చేశారు. మనదేశపు నిజమైన వారసుడి జీవితంలోని స్వాతంత్ర్య పోరాటం, అతనిలోని ధైర్యసాహసాలు భావితరాలకు ఎంతగానో ఆదర్శంగా నిలుస్తాయి.
కార్గిల్ వార్ స్మారక స్తూపం:
1999 లో కశ్మీర్‌లోని కార్గిల్‌ను దురాక్రమణ చేసిన పాకిస్తాన్ ఆర్మీపై భారత సైన్యం వీరోచిత పోరాటం చేసి విజయం సాధించింది. పాక్ సైన్యాన్ని ఓడించి కార్గిల్ భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది భారత్. “ఆపరేషన్ విజయ్’ విజయవంతమైనట్లు 1999 జులై 26న భారత్ అధికారింగా ప్రకటించింది. ఆ రోజున ప్రతియేటా కార్గిల్ విజయ్ దివస్‌ను ఘనంగా జరుపుకుంటూ కార్గిల్ అమరవీరుల త్యాగాలను భారత్ స్మరించుకుంటోంది. అయితే, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత యుద్ధ వీరుల త్యాగాలను స్మరించుకొనేందుకు ఢిల్లీలో జాతీయ యుద్ధ స్మారకాన్ని నిర్మించారు. ఇండియాగేట్ ఆవరణలో సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో రూ. 176 కోట్ల వ్యయంతో జాతీయ యుద్ధ స్మారక కేంద్రాన్నిఏర్పాటు. స్మారక కేంద్రం మధ్యనిర్మించిన రాతి స్తంభం కింద ఏర్పాటు చేసిన దీపం నిరంతరం వెలుగుతూనే ఉంటుంది.
పంజాబ్:
దేశంలోని అతిచిన్న రాష్ట్రాలలో ఒకటైన పంజాబ్.. సంపదలో నైపుణ్యాన్ని కలిగివుంది. 1947 లో బ్రిటీష్ వాళ్లు పంజాబ్‌ను భారతదేశం, పాకిస్తాన్ నుండి విడగొట్టిన తర్వాత తిరిగి పంజాబ్ 1966లో హిమాచల్ ప్రదేశ్, హర్యానాగా విభజించబడింది. చారిత్రక స్థలాలు..జానపద కళారూపాలు..సహజసిద్ధమైన ప్రకృతి అందాలు పంజాబ్ రాష్ట్ర పర్యాటకానికి నిదర్శంగా నిలుస్తాయి. పంజ్ అంటే ఐదు, ఆబ్ అంటే నీరు..ఈ రెండు పదాల నుండి పంజాబ్ అనే పదం వచ్చింది. జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ అనే ఐదు నదుల సంగమం పంజాబ్. ఇక్కడి భూభాగాన్ని సస్యశ్యామల్యం చేస్తున్నాయి. ఇక ఇక్కడి కోటల అందాలు రాజరికపు చరిత్రకు అద్దం పడుతుంటాయి. అలనాటి చారిత్రక అవశేషాలు భద్రపరిచేందుకు ఏర్పాటు చేసిన మ్యూజియంలు పర్యాటకుల మనస్సును కట్టిపడేస్తాయి.