Internet Users: ఇంటర్నెట్ తెగ వాడేస్తున్న గ్రామీణ జనం… 2025నాటికి వినియోగదారులు ఎందరంటే?

|

Jun 04, 2021 | 3:58 PM

Internet Usage: రెండు దశాబ్ధాల క్రితం వరకు ఇంటర్నెట్ పట్టణాలు, ధనవంతులకు మాత్రమే పరిమితమైన అంశం. అయితే ఇప్పుడు ధనిక, పేద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరి జీవితాలతోనూ ఇంటర్నెట్ పెనవేసుకుంది.

Internet Users: ఇంటర్నెట్ తెగ వాడేస్తున్న గ్రామీణ జనం... 2025నాటికి వినియోగదారులు ఎందరంటే?
Representative Image
Follow us on

రెండు దశాబ్ధాల క్రితం ఇంటర్నెట్ పట్టణాలు, ధనవంతులకు మాత్రమే పరిమితమైన అంశం. అయితే ఇప్పుడు ధనిక – పేద, గ్రామీణ – పట్టణ అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరి జీవితాలతోనూ ఇంటర్నెట్ పెనవేసుకుంది. ఎక్కడో అమెరికా కంపెనీలో పనిచేసే ఉద్యోగులు కూడా మారుమూల గ్రామంలో ఉంటూ ఇంటర్నెట్ వాడుకుని ‘వర్క్ ఫ్రం హోమ్‘ పని కానిచ్చేస్తున్నారు.  కోట్లాది మందికి ఇంటర్నెట్ లేనిదే రోజు గడవని పరిస్థితి. డిజిటల్ విప్లవం కారణంగా దేశంలో ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా పెరిగింది..పెరుగుతోంది. టెక్నాలజీకి తోడు ఇంటర్నెట్ డేటా మిగిలిన దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉండటం కూడా దీనికి కారణమవుతోంది.  5జీ అందుబాటులోకి వచ్చాక ఇంటర్నెట్ వినియోగం మరింత పెరగే అవకాశముంది.

పట్టణ ప్రాంతాలకు ధీటుగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో 2025నాటికి దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 90 కోట్లకు చేరుకోనున్నట్లు అంచనావేస్తున్నారు. 2020 వినియోగదారుల సంఖ్య(62.2 కోట్ల)తో పోలిస్తే ఐదేళ్లలో 45 శాతం మేర ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య పెరగనున్నట్లు ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంచనావేసింది. ప్రస్తుతం నగరాల్లో 32.3 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉండగా…గ్రామీణ ప్రాంతాల్లో 29.9 కోట్ల మంది ఉన్నారు. అయితే 2025 నాటికి నగరాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ మంది ఇంటర్నెట్ వినియోగించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందని ఐఏఎంఏఐ నివేదిక అభిప్రాయపడింది.

Internet Usage

ప్రస్తుతం గ్రామీణ జనాభాతో పోలిస్తే పట్టణప్రాంతల్లోని జనాభా రెండు రెట్లు ఎక్కువగా ఇంటర్నెట్ వినియోగిస్తున్నా…యేటా పట్టణాల కంటే వేగంగా గ్రామాల్లో ఇంటర్నెట్ వినియోగం పెరుగుతోంది. 2020లో పట్టణ జనాభాలో 67 శాతం మంది ఇంటర్నెట్ వినియోగిస్తుండగా…గ్రామీణ జనాభాలో 31 శాతం వినియోగిస్తున్నారు. మునుపటి సంవత్సరంతో పోలిస్తే 2020లో పట్టణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 4 శాతం పెరగ్గా…గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుదల 13 శాతంగా ఉంది.

ప్రస్తుతం దేశంలో ఇంటర్నెట్ వినియోగిస్తున్న వారిలో 58 శాతం మంది పురుషులు కాగా…42 శాతం మంది మహిళలు ఉన్నట్లు ఐఏఎంఏఐ నివేదిక వెల్లడించింది. వివిధ భాషల్లో సమాచార వినియోగం, వాయిస్, వీడియో వినియోగం గణనీయంగా పెరగనున్నట్లు ఆ నివేదిక స్పష్టంచేసింది. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక వినియోగదారులు మొబైల్ ద్వారానే ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

బ్యాంక్ కస్టమర్లకు గుడ్‏న్యూస్.. ఆ బ్యాంకులో కొత్త సర్వీసులు.. లోన్ తీసుకున్నవారికి మరింత ప్రయోజనం..

Viral Video: సోమ‌రిపోతు ఏనుగు వింత చేష్టలు.. నవ్వులు పూయిస్తున్న వీడియో.. నెట్టింట వైరల్‌..!