
బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈశాన్య ఢిల్లీ అల్లర్ల కేసులో జవహర్‌లాల్ యూనివర్సిటీ-జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ నాయకుడు, యునైటెడ్ ఎగైనెస్ట్ హేట్ కార్యకర్త ఉమర్ ఖలీద్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంపై కపిల్ మిశ్రా హర్షం ప్రకటించారు.. పోలీసులను అభినందించారు. అక్కడితో ఆగితే బాగుండేది కానీ… ఉమర్ ఖాళీద్, తాహిర్ హుస్సేన్ వంటి నేరస్తులను ఉరి తీయడం ఖాయమని తాను గట్టిగా నమ్ముతున్నానని వ్యాఖ్యానించారు.. ఇలా వ్యాఖ్యానించిన వీడియో మెసేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలను ముంబాయి 26/11 ఉగ్రవాదదాడితో పోల్చారు కపిల్‌మిశ్రా. ఓ పథకం ప్రకారం జరిపిన పెద్ద కుట్ర అని అన్నారు.. రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తూ హింసాత్మక అల్లర్లకు, దాడులకు ఉమర్, తాహిర్‌లు ప్రయత్నించారని చెప్పారు.. షాపులను తగులబెట్టి, ప్రజలను చంపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.. ఇలాంటి ఉగ్రవాదులను యావజ్జీవం జైలులోనే ఉంచాలని, లేదా ఉరి తీయాలని కపిల్‌మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు.