
డెహ్రాడూన్, డిసెంబర్ 28: ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో డిసెంబర్ 9న సెలాకి ప్రాంతంలో స్థానిక మార్కెట్‌లో హింసాత్మక ఘర్షణ చోటు చేసుకుంది. నిత్యం రద్దీగా ఉంటే ఈ మార్కెట్‌కి అంజెల్, అతని తమ్ముడు మైఖేల్ నిత్యావసరాల కోసం వెళ్లారు. అయితే వారిని కొంతమంది వ్యక్తులు అడ్డుకున్నారు. ఈ సోదరులను జాతిపరంగా దూషించి, ‘చైనీస్’ అని పిలిచారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
అయితే అంజెల్ జాత్యహంకార దూషణను సహించలేకపోయాడు. ‘మేము చైనీయులం కాదు. మేము భారతీయులం. దానిని నిరూపించడానికి మేము ఏ సర్టిఫికెట్ చూపించాలి?’ అని వారితో సవాలు చేశాడు. దీంతో రెచ్చిపోయిన మూక వారితో ఘర్షణకు దిగింది. కొన్ని క్షణాల్లోనే అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ వ్యక్తులు ఇద్దరు సోదరులపై కత్తులతో దాడి చేస్తూ.. దుర్భాషలాడారు. ఈ దాడిలో అంజెల్ మెడ, వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. మైఖేల్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అంజెల్ చికిత్స పొందుతూ మృతి చెందగా.. అతని సోదరుడు ఇంకా మృత్యువుతో పోరాడుతున్నాడు. అతడి పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
అంజెల్ మృతదేహాన్ని శనివారం (డిసెంబర్ 27) అగర్తలాకు తరలించారు. ఆయన మరణం త్రిపుర,ఇతర ఈశాన్య రాష్ట్రాలలో ఆగ్రహం రేకెత్తించింది. తిప్రా మోతా పార్టీ చైర్మన్ ప్రద్యోత్ బిక్రమ్ మాణిక్య దేబ్బర్మ, కుటుంబానికి వైద్య సహాయం, అంత్యక్రియల ఏర్పాట్లలో సహాయం చేశారు. ఈశాన్య ప్రాంతాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని జాతి వివక్షకు గురిచేయడం బాధాకరం అని దేబ్బర్మ మీడియాతో అన్నారు. ఈ దాడులు మమ్మల్ని విభజిస్తున్నాయి. మాకు న్యాయం కావాలని ఆయన అన్నారు. మైఖేల్ చక్మా ఫిర్యాదు మేరకు డిసెంబర్ 12న కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు బాల నేరస్థులు సహా ఆరుగురు నిందితులను డిసెంబర్ 14న పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు యజ్ఞ అవస్థి నేపాల్‌కు పరారైనట్లు తెలుస్తుంది. అతడి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. నిందితుడిపై రూ.25,000 రివార్డును కూడా పోలీసులు ప్రకటించారు. అంజెల్ మరణం అనంతరం ఈ కేసులో హత్య అభియోగాలు చేర్చారు. ఈ క్రమంలో జాతి విద్వేష నేరాలకు వ్యతిరేకంగా జాతీయ చట్టం తీసుకురావాలనిఈశాన్య ప్రాంతంలోని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ నిరసనలు ప్రారంభించాయి. డెహ్రాడూన్‌లోని విద్యార్థి సంఘాలు కూడా దేశంలోని అన్ని ప్రాంతాల విద్యార్థుల భద్రత, గౌరవం కోసం పిలుపునిచ్చాయి.
డిసెంబర్ 9న డెహ్రాడూన్‌లో జరిగిన దాడిలో విద్యార్థి మరణించిన ఘటనపై త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా శనివారం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామితో మాట్లాడారు. పుష్కర్ సింగ్ ధామితో తాను మాట్లాడిన సమయంలో ఈ కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను ఇప్పటికే అరెస్టు చేసినట్లు సీఎం మాణిక్ సాహా తెలిపినట్లు ముఖ్యమంత్రి ధామి అన్నారు. తదుపరి దర్యాప్తు జరుగుతోందని, పూర్తి న్యాయం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారని అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.