
ఉత్తరాదిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజస్థాన్‌లో అయితే ఎడతెరపిలేని వర్షాలతో జనం ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అయితే జోధ్‌పూర్‌లో కురిసిన భారీ వర్షాలకు ఓ ఇంటి గోడ కుప్పకూలిపోయింది. నీటికి బాగా నానిపోవడంతో.. గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటన జోధ్‌పూర్‌లోని పవ్తా ఏరియాలో జరిగింది.
మరోవైపు ఢిల్లీ, హర్యానాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షం కురవడంతో రోడ్లన్ని జలమయమైయ్యాయి. భారీ వర్షానికి హర్యానాలోని చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లు, అండర్‌పాస్‌లతోపాటు వీధులన్నీ నీటి మునగడంతో ట్రాఫిక్‌జామ్‌లు ఏర్పడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జనం బాధలు వర్ణణాతీతంగా మారాయి.
అటు హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. మరోవైపు కొండచరియలు విరిగిపడుతున్నాయి. వారంపదిరోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయారు హిమాచల్ ప్రదేశ్ ప్రజలు. ఇప్పటికే వరదలకు పదులసంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిశాయి. ఇప్పటివరకు 80మంది చనిపోయారు. ఇక ఉత్తరాఖండ్‌లోనూ వర్షబీభత్సం కనిపిస్తోంది. చమోలీ గ్రామంలో క్లౌడ్ బరస్ట్ వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు అలకనంద నది పొంగి పొర్లుతోంది. రుద్రప్రయాగ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు నదిలో నీటి ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది.