
హోర్ముజ్ జలసంధి చుట్టూ మళ్లీ భద్రతా సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో పర్షియన్ గల్ఫ్‌లో చిక్కుకుపోయిన భారత ప్రయోజనాలకు చెందిన కనీసం తొమ్మిది చమురు, ఎల్పీజీ ట్యాంకర్లకు సురక్షిత మార్గం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం దౌత్యపరమైన చర్యలు వేగవంతం చేసింది. బ్లూమ్‌బెర్గ్ కథనం ప్రకారం, ఈ అంశంపై ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరపడంతో పాటు, అక్కడ పనిచేస్తున్న భారతీయ నావికుల భద్రతకు కూడా కేంద్రం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.
హోర్ముజ్ జలసంధిలో మరోసారి భద్రతా పరిస్థితులు దిగజారడంతో ముడి చమురు, ఎల్పీజీని తరలిస్తున్న నౌకల రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ప్రస్తుతం తొమ్మిది ట్యాంకర్లలో మొత్తం 198 మంది భారతీయ నావికులు చిక్కుకుపోయి, జలసంధి గుండా ప్రయాణించేందుకు అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. నౌకల కదలికలను భారత ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇరాన్ అధికారులతో నేరుగా చర్చలు జరపనుందని నివేదిక పేర్కొంది.
జూన్‌లో ఒమన్ గల్ఫ్‌లో వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు మరణించిన ఘటన తర్వాత కేంద్రం మరింత అప్రమత్తమైంది. ఫిబ్రవరి చివర్లో ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి భారతదేశానికి రావాల్సిన సుమారు 50 నౌకలు హోర్ముజ్ జలసంధిని దాటినప్పటికీ, సాధారణ పరిస్థితులతో పోలిస్తే దిగుమతులు గణనీయంగా తగ్గాయి. సంఘర్షణలకు ముందు భారత ముడి చమురు దిగుమతుల్లో సుమారు 40 శాతం, ఎల్‌ఎన్‌జీ సరఫరాలో 60 శాతం, ఎల్‌పీజీ దిగుమతుల్లో దాదాపు 90 శాతం ఈ జలసంధి ద్వారానే జరిగేవి.
ఇదే సమయంలో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్ మద్దతుతో జరిగిన నౌకలపై దాడులకు ప్రతీకారంగా అమెరికా 80కిపైగా లక్ష్యాలపై వైమానిక దాడులు జరిపినట్లు ప్రకటించింది. దీనికి ప్రతిస్పందనగా బహ్రెయిన్, కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు ఇరాన్ వెల్లడించింది. ఈ పరిణామాల మధ్య అంతర్జాతీయ చమురు సరఫరాపై అనిశ్చితి నెలకొనగా, హోర్ముజ్ జలసంధిలో పరిస్థితులు ఎప్పుడు సాధారణ స్థితికి వస్తాయన్న అంశంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..