Assam CM Himanta Biswa Sarma: అస్సాం రాష్ట్ర 15వ ముఖ్యమంత్రిగా డాక్టర్ హిమంత బిస్వా శర్మ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గువాహటిలోని పంజాబరి ప్రాంతంలోని శ్రీమంత శంకర్‌దేవ్ కళాక్షేత్రంలో మధ్యాహ్నం 12 గంటలకు కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. కాగా.. హిమంత బిస్వా శర్మ జలుక్‌బరి నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు ఎన్నికయ్యారు. మొదట కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన 2014 ఎన్నికల అనంతరం బీజేపీలో చేరారు.
ఈ క్రమంలో హిమంత బిస్వా శర్మ, ప్రస్తుత సీఎం సర్బానంద సోనోవాల్ మధ్య సీఎం పదవికి పోటీ నెలకొనడంతో.. అధిష్టానం ఇద్దరితో సమావేశమై హిమంత పేరును ఫైనల్ చేసింది. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సమక్షంలో ఆదివారం జరిగిన సమావేశంలో బీజేపీ శాసన సభ పార్టీ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో జాతీయ నాయకులు అరుణ్ సింగ్, బీఎల్ సంతోష్, అజయ్ జామ్వాల్, బై జయంత్ జే పాండా, దిలీప్ సైకియా, రాష్ట్ర అధ్యక్షుడు రంజీత్‌కుమార్ దాస్ తదితర సీనియర్ నేతలు పాల్గొన్నారు. అనంతరం సీఎం సర్బానంద సోనోవాల్ గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖను అందజేసిన విషయం తెలిసిందే.
126 అసెంబ్లీ స్థానాలున్న అసోం అసెంబ్లీకి మూడు విడుతల్లో ఎన్నికలు జరగ్గా.. బీజేపీ కూటమి విజయం సాధించింది. ఎన్డీఏ కూటమిలో బీజేపీ 60 సీట్లు, ఏజీపీ 9 సీట్లు గెలవగా.. యూపీపీఎల్ 6 సీట్లు సాధించాయి. కాంగ్రెస్ 29, ఏఐయూడీఎఫ్ 16, బీపీఎఫ్ 4 సీట్లు గెలుచుకున్నాయి.
Also Read: