Petrol Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు అందుకే పెరుగుతున్నాయి.. కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలి వివాదాస్పద వ్యాఖ్యలు..

|

Oct 11, 2021 | 9:22 PM

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సరికొత్త రికార్డులకు చేరుకుంటుండగా, పెట్రోలియం, సహజవాయువుల శాఖ కేంద్ర సహాయ మంత్రి రామేశ్వర్ తేలి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Petrol Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు అందుకే పెరుగుతున్నాయి.. కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలి వివాదాస్పద వ్యాఖ్యలు..
Mos Petroleum Rameswar Teli
Follow us on

Rameswar Teli on Petrol Diesel Prices: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సరికొత్త రికార్డులకు చేరుకుంటుండగా, పెట్రోలియం, సహజవాయువుల శాఖ కేంద్ర సహాయ మంత్రి రామేశ్వర్ తేలి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం అందించే ఉచిత కోవిడ్ -19 టీకాలు పెట్రోల్-డీజిల్ ధరలు పెరగడానికి దారితీశాయని చెప్పుకొచ్చారు. ఒక లీటరు పెట్రోల్ కంటే ఒక లీటరు హిమాలయ నీరు ఖరీదైనదని కూడా తేలి చెప్పారు.

దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతూ, సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఈ ధరల పెరుగుదలపై మంత్రి రామేశ్వర్ తెలిని ప్రశ్నించగా.. ఆయన చెప్పిన సమాధానం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వం ఉచితంగా అందిస్తోన్న కరోనా టీకాల కారణంగా చమురు ధరలు పెరుగుతున్నాయని అన్నారు. ‘పెట్రోల్ అంత ఖరీదైనది కాదు. కేంద్రం, రాష్ట్రాలు దానిపై పన్నులు విధించాయి. మరోపక్క ప్రభుత్వం ప్రజలందరికి కరోనా టీకాలు ఉచితంగా అందిస్తోంది. మీరు చెల్లించకుండా టీకాలకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ పన్నుల నుంచే టీకా డబ్బులు వచ్చాయి. ఈ ప్రభుత్వం 130 కోట్ల మందికి ఉచితంగా టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో టీకా డోసు ధర రూ.1,200. ఒక్కొక్కరికి రెండు డోసులు వేయాలి’ అని మంత్రి వెల్లడించారు.

అలాగే హిమాలయన్ మంచినీళ్లకు పెట్రోల్‌కు పోలిక పెడుతూ మరో వివరణ ఇచ్చారు. ‘మీరు హిమాలయన్ మంచినీళ్లు తాగాలంటే ఒక బాటిల్‌కు రూ.100 వెచ్చించాలి. పెట్రోల్ కంటే దాని ధరే ఎక్కువ. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పెరిగితే, అందుకు తగ్గట్టే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. మా మంత్రిత్వ శాఖ ఈ ధరల్ని నియంత్రించలేదు. అది వాణిజ్య శాఖ పరిధిలోని విషయం’ అని అన్నారు. కోవిడ్ -19 పరిస్థితిని పరిష్కరించడానికి ఇటీవల తన మంత్రిత్వ శాఖ నిధులను ఆరోగ్య మంత్రిత్వ శాఖకు మళ్లించారని రామేశ్వర్ తేలి చెప్పారు.

గత కొద్దికాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. సోమవారం లీటర్‌ పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసల వరకు పెరిగింది. దాంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో చమురు ధరలు 100 మార్కును దాటడంతో ప్రజల జేబులకు చిల్లు పడుతోంది. అస్సాంలోని దిబ్రూగఢ్ నుండి లోక్ సభ సభ్యుడుగా ఎన్నికైన రామేశ్వర్ తేలి.. కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల శాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు.

మరోవైపు, అసోం బిజెపి అధ్యక్షుడు భాబేశ్ కలిత.. పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదల గురించి మాట్లాడుతూ.. ముగ్గురు వ్యక్తులు మోటార్‌సైకిల్‌లో ప్రయాణించాలని, అలాగే ప్రజలు నడక సాధన చేయాలని సూచించారు.


Read Also…Corona Vaccine: మొట్ట మొదటి కరోనా టీకా స్ఫుత్నిక్.. యూకే టీకా ఫార్ములా దొంగిలించి తయారు చేశారా? వ్యాక్సిన్ పై కొత్త రచ్చ!