Pay fine or collect plastic waste: హెల్మెట్ వాడకాన్ని చాలా మంది ఈజీగా తీసుకుంటారు. రహదారులపై ప్రమాదాల సమయంలో మన ప్రాణాలను రక్షించడంలో హెల్మెట్ పోషించే పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాహనదారులంతా తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలంటూ పోలీసులు ఎంత అవగాహన కల్పించినా కొంతమందిలో మార్పు రావడంలేదు. మరికొందరైతే.. పోలీసులు పట్టుకుంటే ఫైన్ కట్టేదాంలే అనే ధీమాలో ఉంటున్నారు. ట్రాఫిక్ నిబంధనలు, వాహనదారులు వెహికల్ నడిపేటప్పుడు పాటించాల్సిన నియమ నిబంధనలు మన కోసమేననే విషయాన్ని కొందరు గ్రహిస్తున్నా.. మరికొందరు మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. హెల్మెట్ పోలీసుల కోసం పెట్టుకుంటున్నట్లు కొందరు ఆలోచిస్తున్నారు. అందుకే చాలా మంది పోలీసులు కనిపిస్తేనే హెల్మెట్ పెట్టుకుంటారు. అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే తలకు తీవ్రమైన గాయాలు కాకుండా.. ప్రమాదం నుంచి హెల్మెట్ మనల్ని రక్షిస్తుంది. హెల్మెట్ పెట్టుకోకపోతే.. కొన్ని సందర్భాల్లో తలకు తీవ్రగాయాలై.. అది ప్రాణాలు కోల్పోయే పరిస్థితులకు దారితీస్తుంది. ఇలాంటి వాటికి చెక్ పెట్టి.. వాహనదారులు ఎక్కువుగా హెల్మెట్ పెట్టుకునేలా చేయడానికి ఛత్తీస్‌ఘడ్ పోలీసులు కొంత వినూత్నంగా ఆలోచించారు.
హెల్మెట్ పెట్టుకోండి.. పెట్టుకోకపోతే.. జరిమానా చెల్లించండి.. లేకపోతే ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించండంటూ కొత్త నినాదాన్ని తీసుకొచ్చారు ఛత్తీస్‌గఢ్ పోలీసులు. హెల్మెట్ నియమాన్ని అమలు చేయడానికి ప్రత్యేకమైన కార్యచరణను రూపొందించారు. ఛత్తీస్‌ఘడ్‌లోని ముఖ్య నగరాలైన భిలాయ్, దుర్గ్‌లలో ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించకుండా, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే వీధుల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరాల్సి ఉంటుంది. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించే లక్ష్యంతో దుర్గ్ జిల్లా పోలీసులు ఈ ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించారు.
దుర్గ్ ఎస్పీ అభిషేక్ పల్లవ్ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎవరైనా నిబంధనలు పాటించనివారికి అవగాహన కల్పించడానికి ఈ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని, లేకుంటే బహిరంగ ప్రదేశాల్లో్ ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించాల్సి ఉంటుందన్నారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోనూ ఇదే తరహాలో విధానాన్ని అక్కడి పోలీసులు ప్రారంభించారు. అలాగే నో పార్కింగ్ జోన్‌లో వాహనాలను పార్కింగ్ చేసే వ్యక్తులపై కూడా కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..