భారీ వర్షాలు, వరదలు ఉత్తరాఖండ్‌ను ముంచెత్తాయి. ఎడతేరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి..జనావాసాల్లోకి ఒక్కసారిగా పోటెత్తింది వరదనీరు. దీంతో వరదలో చిక్కుకున్న వారు ఒడ్డుకు చేరేందుకు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. వరద ఉధృతికి బ్రిడ్జిలు, రోడ్లు కొట్టుకుపోతున్నాయి. చంపావత్‌లో నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జ్..వరద ఉధృతికి కూలిపోయింది. వరద ప్రవాహానికి పలు వాహనాలు కొట్టుకుపోతున్నాయి. వరద ఉధృతికి కొట్టుకుపోతున్న ఓ కారును తీవ్రంగా శ్రమించి క్రేన్ సాయంతో బయటకు తీశారు రెస్క్యూ టీమ్. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.
వర్షాలు, వరదల ధాటికి కేరళలో మృతుల సంఖ్య 38కి చేరింది. కొట్టాయం జిల్లా కూట్టిక్కల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 24కి చేరింది. ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. భారీ వరదలకు నలుగురు చిన్నారులతో సహా ఓ కుటుంబమంతా జలసమాధి అయిపోయింది. 10 డ్యాంల పరిధిలో రెడ్ అలెర్ట్ జారీ చేశారు అధికారులు. నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
అయితే ఇంత వరదలోనూ తమ పెళ్లిని వాయిదా వేసుకోలేదు ఓ జంట. చుట్టూ నీరున్నా ఓ భారీ అల్యూమినియం వంట పాత్రలో కూర్చొని అతికష్టంమీద ఫంక్షన్‌హాల్‌కు చేరుకున్నారు. చివరికి పెళ్లి మంటపం సైతం నీటితో నిండిపోయింది. అయినా అవేవి వారి నిర్ణయాన్ని ఆపలేకపోయింది. ఈ పెళ్లికి పరిమిత అతిధులు, బంధువులను ఆహ్వానించి వారి సమక్షంలోనే తమ వివాహ తంతు ముగించేశారు.
ఇవి కూడా చదవండి: Sirimanu Utsavam: నేడు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు..
Chanakya Niti: ఇలాంటి శత్రువులతో జాగ్రత సుమీ.. అలాంటివారి పట్ల ఏమరపాటు అసలే వద్దు..