Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్ర పాక్షికంగా పునఃప్రారంభమైంది. పహల్గాం నుంచి యాత్రను ప్రారంభించారు. కానీ బాల్తల్‌లో మరమ్మత్తు పనులు ఇంకా పూర్తి కాలేదు. ఆ ప్రాంతాల్లో బురదను తొలగించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరోవైపు సోనామార్గ్, బాల్తాల్‌లో మళ్లీ వర్షం మొదలైంది. దీంతో అమర్ నాథ్ యాత్రకు వెళ్లాలంటేనే భక్తులు భయపడుతున్నారు. ఇదిలా ఉంటే, అమర్‌నాథ్ యాత్రకు వెళ్లి ప్రమాదానికి గురైన భక్తులను రక్షించేందుకు జవాన్లు నిరంతరం శ్రమిస్తున్నారు. సహాయక చర్యలు మరింత వేగవంతం చేసేందుకు ఆధునిక పరికరాల సాయం కూడా తీసుకుంటున్నారు.
మరోవైపు అమర్‌నాథ్ యాత్రకు వచ్చే కొత్త బ్యాచ్‌లను కూడా రద్దు చేశారు. తీవ్ర అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా జమ్మూ నుంచి కశ్మీర్‌లోని బేస్ క్యాంప్‌లకు చేరుకోవాల్సిన అమర్‌నాథ్ యాత్రికుల కొత్త బ్యాచ్‌లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం అమర్‌నాథ్ సమీపంలో సంభవించిన ఆకస్మిక వరదల్లో 16 మంది యాత్రికులు మృతి చెందగా మరో 40 మంది వరకు జాడ తెలియకుండా పోయిన విషయం తెలిసిందే. జూన్ 30వ తేదీ నుంచి మొదలైన 43 రోజుల అమర్‌నాథ్ యాత్ర ఆగస్ట్ 11వ తేదీన రక్షా బంధన్ రోజున ముగియనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి