
గుజరాత్‌లోని గోల్‌వాడ దగ్గర జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. యాత్రలో భాగంగా ఉన్న ఏనుగు ఒక్కసారిగా భక్తులపైకి దూసుకెళ్లింది. దీంతో భక్తులంతా భయంతో బయటికి పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథ రథయాత్ర ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది. కన్నుల పండుగగా జరిగే ఈ యాత్రను చూడడానికి దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ రథయాత్రలో భక్తులు జగన్నాథుడు, ఆయన సోదరసోదరీమణులు బలభద్రుడు, సుభద్రలకు చెందిన రథాలను లాగుతారు. ఈ ముగ్గురు దేవుళ్లు ముందుగా గుండిచా ఆలయానికి వెళ్లి అక్కడ కొంత కాలం గడుపుతారు. తరువాత అక్కడ నుంచి జగన్నాథ ఆలయానికి తిరిగి వస్తారు. అంటే జూన్27న మొదలైన ఈ రథయాత్ర జులై 8న ముగ్గురు దేవతలు తమ ప్రధాన మందిరానికి తిరిగి రావడంతో ముగుస్తుంది. 12వ శతాబ్దం నుంచి నేటి వరకు ఏటా పూరీ జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతూనే ఉంది.
పూరీ జగన్నాథుని రథయాత్రకు దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో అధికారులు 10,000 మంది భద్రతా సిబ్బందిని నియమించారు. వీరిలో ఒడిశా పోలీసులు సహా సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ (సీఏపీఎఫ్)కు చెందిన 8 కంపెనీలు ఉన్నాయి. నిఘా కోసం పోలీసులు పూరీ పట్టణంలో 250కి పైగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్-ఎనేబుల్డ్ కెమెరాలు అమర్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి