పరువునష్టం దావా కేసులో రాహుల్‌కు ఊరట దక్కలేదు. మోదీ ఇంటిపేరుపై రాహుల్ గాంధీపై దాఖలైన పరువునష్టం కేసుకు సంబంధించి హైకోర్టులో ఇవాళ మళ్లీ విచారణ జరిపింది. తనకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరుతూ రాహుల్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్‌లో ఉంచింది. వేసవి సెలవుల తర్వాత ఈ కేసులో తీర్పును జస్టిస్ హేమంత్ ప్రచక్ ప్రకటించనున్నారు. అప్పటి వరకు రాహుల్ గాంధీకి మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది.
మోదీ ఇంటిపేరు కేసులో దాఖలైన క్రిమినల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించిన సూరత్ జిల్లా కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత పార్లమెంటు సభ్యత్వానికి అనర్హుడయ్యారు. జస్టిస్ హేమంత్ ఎం. ప్రచారక్ ధర్మాసనం ముందు ఫిర్యాదుదారు పూర్ణేష్ మోదీ తరఫున సీనియర్ న్యాయవాది నిరుపమ్ నానావతి హాజరయ్యారు. నేరాల తీవ్రత, శిక్షలను ఈ స్థాయిలో చూడకూడదని అన్నారు. అతని (రాహుల్ గాంధీ) అనర్హత చట్టం ప్రకారం జరిగింది. ఇంతలో కేసు అసలు రికార్డులు, విచారణలను తన ముందు ఉంచాలని ట్రయల్ కోర్టును ఆదేశిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.
కొన్నిరోజుల క్రితం సూరత్ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు రాహుల్ గాంధీ. తనకు విధించిన శిక్షపై స్టే విధించాలని గుజరాత్ హైకోర్టును అభ్యర్థించారు. అంతకుముందు రాహుల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సూరత్ సెషన్స్ కోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా జడ్జి ఆర్‌పీ మొగేరా కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ కాస్త జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాల్సిందని అన్నారు. మోదీ పేరు ఉన్నవారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం వల్ల.. ఖచ్చితంగా ఫిర్యాదుదారుడు పూర్ణేష్ మోదీ ప్రతిష్ఠకు హాని కలిగి ఉండవచ్చు అని జస్టిస్ ఆర్‌పీ మొగేరా విచారణ సందర్భంలో అభిప్రాయపడ్డారు.
పరువు నష్టం కేసుపై విచారణ జరిపిన సూరత్ కోర్టు.. రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే ఈ తీర్పును పై కోర్టులో సవాల్ చేసేందుకు వీలుగా 30 రోజుల గడువు ఇచ్చింది. అప్పటి వరకు బెయిల్ కూడా మంజూరు చేసింది. ఈ కేసులో తనపై విధించిన శిక్షపై స్టే విధించాలని కోరుతూ రాహుల్ గాంధీ వేసిన పిటిషన్‌ను సూరత్ సెషన్స్ కోర్టు ఏప్రిల్ 20న తిరస్కరించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం