
గుజరాత్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ గుజరాత్‌లోని వల్సాద్, నవసారి, సూరత్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో వరదలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. పలు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగిపోయాయి. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయగా, రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర సహాయక చర్యలను వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి, ప్రభావిత జిల్లాల్లో సహాయక, పునరావాస చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రి హర్ష్ సంఘ్వి, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి నరేష్ పటేల్‌తో పాటు కార్యదర్శులు రమ్య మోహన్, అలోక్ పాండేలు వెంటనే సూరత్, వల్సాద్, నవసారి జిల్లాలకు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల్లో ఇన్‌చార్జ్ కార్యదర్శులు అక్కడే ఉండి స్థానిక యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ప్రజలు అత్యవసర పరిస్థితులు మినహా ఇళ్ల నుంచి బయటకు రావద్దని, నీరు నిలిచిన ప్రాంతాలకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
నవసారి జిల్లాలో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. పూర్ణ, అంబిక, కావేరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కావేరి నది నీటిమట్టం ప్రమాదస్థాయి 19 అడుగులను దాటి 27 అడుగులకు చేరుకోవడంతో చిఖ్లిలోని 20 అడుగుల ఎత్తైన శివాలయాన్ని కూడా వరదనీరు తాకింది. జిల్లాలో లక్షలాది మందికిపైగా ప్రజలు ప్రభావితమయ్యారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు, స్థానిక పరిపాలన అధికారులు కలిసి ఇప్పటివరకు 500 మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నవసారి జిల్లాలో సగటున 10.17 అంగుళాల వర్షపాతం నమోదవగా, వాన్స్‌డా తాలూకాలో అత్యధికంగా 17.13 అంగుళాలు, ఖేర్‌గామ్‌లో 14.09 అంగుళాల వర్షపాతం నమోదైంది.
మరోవైపు అహ్మదాబాద్ నగరం కూడా భారీ వర్షాలకు జలమయమైంది. బోడక్‌దేవ్, శివరంజని, ఎస్జీ హైవే, జోధ్‌పూర్ తదితర ప్రధాన ప్రాంతాల్లో రహదారులపై భారీగా నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. ముందుజాగ్రత్త చర్యగా పరిమల్ అండర్‌పాస్, ఉస్మాన్‌పురా అండర్‌పాస్, నిర్ణయ్‌నగర్ అండర్‌పాస్‌లను వాహనాల రాకపోకలకు అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. పలు ప్రాంతాల్లో రాకపోకలు తీవ్రంగా అంతరాయం కలిగాయి.
భారీ వర్షాల ప్రభావం రైల్వే సేవలపైనా పడింది. వల్సాద్ సమీపంలోని ఘోలాద్–ఉమర్‌గామ్ స్టేషన్ల మధ్య రైల్వే బ్రిడ్జి నంబర్ 203 వద్ద నీటిమట్టం ప్రమాదకరంగా పెరగడంతో పశ్చిమ రైల్వే ముంబై సెంట్రల్ డివిజన్‌లో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. దీంతో ముంబై సెంట్రల్–అహ్మదాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్, గుజరాత్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌తో పాటు మరికొన్ని ప్రధాన రైళ్లను జూలై 23న రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దౌండ్–మన్మాడ్–జల్గావ్–సూరత్ మార్గంలో దారి మళ్లించారు. వాతావరణ పరిస్థితులు మెరుగుపడే వరకు ప్రజలు అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
వీడియో ఇక్కడ చూడండి
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..