Gujarat Rains: గుజరాత్‌లో వరదల బీభత్సం కొనసాగుతోంది. రాజ్‌కోట్, జామ్‌నగర్ జిల్లాల్లో వరదలు విలయతాండవం చేస్తున్నాయి. సౌరాష్ట్రం ప్రాంతం మొత్తం వరద గుప్పిట్లో చిక్కుకుంది. ఆర్మీ ,ఎయిర్‌ఫోర్స్‌తో పాటు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. భారీవర్షాలకు ముగ్గురు చనిపోయారు. 14 వేల మందిని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతానికి తరలించాయి. జామ్‌నగర్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. సీఎం భూపేంద్రపటేల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.
రాజ్‌కోట్‌లో వందలాది ఇళ్లు నీట మునిగాయి. ఇళ్లలో చిక్కుకున్న వాళ్లను ప్రాణాలకు తెగించి కాపాడుతున్నారు సహాయక సిబ్బంది. పోలీసు సిబ్బంది కూడా వరద నీటి లోనే విధులను నిర్వహిస్తున్నారు. తమ వాహనాలు మునిగిపోతునప్పటికి ప్రజలను రక్షించడానికి ముందుకెళ్తున్నారు. తాత్కాలిక వంతెనలను ఏర్పాటు చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చాలా గ్రామాలు నీట మునిగినప్పటికి ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్ల సాయంతో జనాన్ని కాపాడుతున్నారు.
వరదల్లో చాలా వాహనాలు కొట్టుకుపోతున్నాయి. వరదల కారణంగా పంటనష్టంతో పాటు భారీగా ఆస్తినష్టం కూడా జరుగుతోంది. గుజరాత్‌లో వరదల పరిస్థితిపై ప్రధాని మోదీ కూడా ఆరా తీశారు. రాష్ట్రానికి అన్నివిధాలా సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. మరో రెండు రోజుల పాటు గుజరాత్‌లో భారీవర్షాలు కురిసే అవకాశమందని వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో చాలా డ్యాంలు నిండిపపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.
జామ్‌నగర్‌లో కొన్ని రోడ్లు జలపాతాలను తలపిస్తున్నాయి.. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు మహారాష్ట్రలో కూడా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. చత్తీస్‌ఘడ్‌లో చాలా చోట్ల నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. భారీ వర్షాల కారణంగా చాలా చోట్ల పంటలు నీట మునిగాయి.
Read also: Fish Ponds: విశాఖ జిల్లాలోని అనధికార రొయ్యల చెరువులపై రెవెన్యూ, మత్స్యశాఖ అధికారుల దాడులు