కేంద్రం విధించిన మోటారు వాహన చట్ట సవరణతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై వాహనదారుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీని నుంచి బయటపడేందుకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చర్యలు తీసుకుంటున్నారు. మోటార్ వాహనాల నూతన చట్టం తమ నడ్డి విరుస్తుందని గగ్గోలు పెడతున్నసామాన్యుడు మోదీ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నాడు.
దీన్ని గమనించిన గుజరాత్ బీజేపీ ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అక్కడి వాహనదారులకు ఉపశమనం కలిగించారు. కేంద్రం అమలు చేయాలన్న జరిమానాల్లో ఏకంగా 50 శాతం కోత విధించారు. కొత్త చట్టం ప్రకారం హెల్మెట్ లేకపోతే రూ.1000 చలానా రాస్తున్నారు. కానీ గుజరాత్‌లో అది రూ.500లకు తగ్గించారు. అదే విధంగా ట్రిపుల్ రైడింగ్‌కు కొత్త చట్టం ప్రకారం రూ.1000లు.. దీనిని రూ.100కి కుదించారు. ఈ విధంగా పలు జరిమానాల్ని భారీగా తగ్గించి వాహనదారులకు ఊరట కల్గించింది గుజరాత్ ప్రభుత్వం.
ఇదిలా ఉంటే ఇది కేవలం మోదీపై వ్యతిరేకతను పోగొట్టే కంటితుడుపు చర్యగా అభిప్రాయపడుతున్నారు దేశంలో మిగిలిన రాష్ట్రాల వాహనదారులు. ఈ తగ్గింపు కేవలం బీజేపీ పాలిత సొంత రాష్ట్రంలో అమలు చేయడం రాజకీయంలో భాగమేనని విమర్శిస్తున్నారు.