పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఓ వైపు ఆందోళనలు కొనసాగుతున్న వేళ.. మరోవైపు మద్దతుగా కూడా ర్యాలీలు చేపడుతున్నారు. ఇది ఇలా కొనసాగుతుండగానే.. కేంద్రమంత్రి మరో సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే ఈ సీఏఏ అంశంపై వెనక్కి తగ్గేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయగా.. నెక్స్ట్ టార్గెట్ రోహింగ్యాలేనంటూ కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. దేశంలోకి అక్రమంగా చొరబడ్డ రోహింగ్యాలను తిప్పి పంపడంపై.. కేంద్రం దృష్టి సారించనుందన్నారు. త్వరలోనే జమ్మూకశ్మీర్ సహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సీఏఏ అమలులోకి రానుందని.. ఇక ఆ తర్వాతి నిర్ణయం రోహింగ్యాలకు సంబంధించే ఉంటుందన్నారు.
ఇప్పటికే జమ్మూకశ్మీర్‌లో వారి జనాభా పెద్ద ఎత్తున ఉందని.. వారి లిస్టును మొత్తం సిద్ధం చేసి.. బయోమెట్రిక్ ఆధారిత వివరాలను సేకరిస్తామన్నారు. ఇక వారంతా మన దేశాన్ని విడిచి వెళ్లాల్సిందేనన్నారు. దీనిపై ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని.. సీఏఏ ద్వారా వారికి ఎలాంటి మినహాయింపు ఉండదన్నారు.