
తెలంగాణ గవర్నర్ తమిళిసై.. పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో ఈ కేంద్రపాలిత ప్రాంతంలో… బేసిగ్గా తమిళనాడుకు చెందిన వారు కావడంతో తమిళనాడు రాజకీయాల్లో.. ఇలా మూడు చోట్లా ఎప్పుడూ ఏదో ఒక అలజడి జరగుతూనే ఉంది. తరచూ ఏవో ఒక ప్రకంపనలు చెలరేగుతూనే ఉన్నాయి. ఇక కేరళలో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ వివాదం.. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఇష్యూ.. ఇలా దక్షిణాదిలో ప్రభుత్వాధినేతలూ వర్సెస్ రాజ్యాంగాధినేతలుగా మారిన పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి.
తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల్లో బోధనా సిబ్బందిని నియమించాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు అసెంబ్లీలో కామన్ రిక్రూట్‌మెంట్ బిల్లును ప్రవేశపెట్టింది. దీన్ని ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ బిల్లును ఆమోదం కోసం రాష్ట్ర గవర్నర్ తమిళిసైకు పంపించారు. గవర్నర్ ఈ బిల్లును పెండింగులో పెట్టడంతో బోధనా సిబ్బంది నియామక ప్రక్రియ ప్రశ్నార్థకమైంది. గవర్నర్ జాప్యంపై స్టూటెండ్ జేఏసీ భగ్గుమంది. సమస్య పరిష్కారం కోసం వెంటనే ప్రత్యక్ష చర్యకు దిగాలని నిర్ణయించింది. తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తుతో రాష్ట్ర గవర్నర్ చెలగాటమాడుతున్నారని విమర్శించింది జేఏసీ. గవర్నర్ ఇలా చేయడం తగదని వారించింది. గవర్నర్ వెంటనే స్పందించి.. బిల్లు క్లియర్ చేయాలనీ.. లేదంటే నవంబర్ 12న ఛలో రాజ్ భవన్ నిర్వహిస్తామని హెచ్చరించింది.. అయితే ఇందుకు తానేమీ భయపడేది లేదని అన్నారు గవర్నర్ తమిళిసై. ఎవ్వరైనా రాజ్ భవన్ కు రావచ్చనీ.. ఎలాంటి అభ్యంతరాల్లేవని అన్నారామె.
తమిళనాడు లోనూ సరిగ్గా ఇలాంటి సమస్యే. జాతీయ స్థాయిలో కేంద్రం నిర్వహిస్తున్న నీట్ పరీక్షలు లోపభూయిష్టంగా ఉన్నాయని భావించింది స్టాలిన్ సర్కార్. నీట్ కు బదులుగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి.. సొంతంగా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ దిశగా అసెంబ్లీలో ఒక బిల్లు ఆమోదించింది. దీన్ని గవర్నర్ కు పంపింది. కానీ తమిళనాడు రాష్ట్రగవర్నర్.. రవి.. ఈ బిల్లును రిజెక్ట్ చేశారు. దీంతో డీఎంకే గవర్నమెంట్, గవర్నర్ మధ్య తీవ్ర విబేధాలు తలెత్తాయి. అంతే కాదు రాజ్ భవన్ ను బహిష్కరించే వరకూ వెళ్లింది వ్యవహారం. గవర్నర్ తీరుపై తమిళనాడు విద్యార్ధిలోకం భగ్గుమంది. గవర్నర్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది డీఎంకే సర్కార్. ఈ దిశగా.. రాష్రపతికి లేఖ రాశారు సీఎం స్టాలిన్.
కేరళలోనూ గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ ఇష్యూ నడుస్తోంది. కేరళ వర్సిటీల వైస్ ఛాన్సలర్ లు తమ పదవులకు రాజీనామా చేయాలని ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమద్ ఖాన్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. గవర్నర్ ఆదేశాలను వీసీలు నిరాకరించారు. దీంతో మిమ్మల్ని పదవుల నుంచి ఎందుకు తొలగించకూడదో.. వివరణ ఇవ్వాలంటూ గవర్నర్ వీసీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ అంశంపై కేరళ హైకోర్టును ఆశ్రయించారు వీసీలు. గవర్నర్ నోటీసులు జారీ చేయడం అక్రమంగా ప్రకటించాలని అభ్యర్ధించారు. గవర్నర్ అంతిమ ఉత్తర్వులు ఇచ్చే వరకూ వారా పదవుల్లో కొనసాగవచ్చని ఆదేశించింది కేరళ హైకోర్టు. ఇటు మీడియా మీద కూడా గవర్నర్ ఆరీఫ్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేయడమూ ఇక్కడ వివాదాస్పదమైంది. ఇటీవల ఆర్థిక మంత్రి పనితీరు సైతం నచ్చలేదంటూ ఆరిఫ్ వ్యాఖ్యానించడం- ఇందుకు సీఎం పినరయి విజయన్ ఖండించడం.. వంటి ఘటనలు కూడా నమోదయ్యాయి.
రాష్ట్ర ప్రభుత్వం రాజ్యంగ వ్యవస్థను పతనం చేసేందుకు ప్రయత్నిస్తోందని గవర్నర్లు అంటుంటే.. ప్రత్యక్షంగా ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వాల హక్కులను గవర్నర్ వ్యవస్థ కాలరాస్తోందన్న వాదోప వాదాలు నడుస్తున్నాయి. తమిళిసై అయితే పాండిచ్చేరిలో తన లెఫ్టినెంట్ గవర్నర్ హోదాలో ఇక్కడి రాజకీయాలను శాసిస్తున్న మాట ప్రచారంలో ఉంది. సరిగ్గా అదే సమయంలో తమిళనాడులోనూ ఆమె ప్రభావం కనిపిస్తోంది. ఇంట్లో తెలుగు మాట్లాడే వారు నన్ను ప్రశ్నిస్తున్నారంటూ.. ఆమె స్టాలిన్ కుటుంబం మీద చేసిన కామెంట్ పెను దుమారం చెలరేగింది. డీఎంకే పెద్దలవి తెలుగు మూలాలని తమిళిసై చేసిన వ్యాఖ్యలపై మురసొలి పత్రిక దీటుగా స్పందించింది. తెలంగాణ గవర్నర్ తమిళనాడులో రాజకీయాలు చేయొద్దు. ఇది ఆమె పని కాదు. రాజకీయం కావాలనుకుంటే రిజైన్ చేసి తమిళనాడుకు రమ్మంటూ సూచించింది.
పశ్చిమ బెంగాల్, ఢిల్లీల్లోనూ సేమ్ ఇలాంటి వ్యవహారాలే నడుస్తున్నాయి. ప్రభుత్వాధినేతలకూ రాజ్యాంగాధినేతలకూ మధ్య పరోక్ష యుద్ధం అవధులు దాటి ప్రత్యక్ష యుద్ధంగా మారింది. గతంలో ఎన్టీఆర్ హయాంలో గవర్నర్ల పాత్రపై తీవ్ర చర్చ సాగింది. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో గవర్నర్ల అంశం తీవ్ర వివాదాస్పదమవుతోంది. తమిళనాడు గవర్నర్ దగ్గర 20 బిల్లులు పెండింగ్ లో ఉండగా.. తెలంగాణలో ఏడు బిల్లులపై గవర్నర్ ఆమోద ముద్ర పడాల్సి ఉంది. ఇపుడీ బిల్లుల వ్యవహారం చినికి చినికి గాలి వానగా మారి.. ఎవరి హక్కులేంటని సామాజిక ప్రశ్న తలెత్తే వరకూ వచ్చింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం