
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందించాలని నిర్ణయం తీసుకుంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య కేంద్రాల ద్వారా వీటిని పంపిణీ చేయనుంది. 14 ఏళ్లు దాటిన బాలికలకు ఈ టీకాకు ఉచితంగా వేయనున్నారు. నాలుగు రకాల గర్భాశయ క్యాన్సర్లను నివారించే సామర్థ్యం ఈ వ్యాక్సిన్‌కు ఉంటుందని ఆరోగ్యశాఖ చెబుతోంది. దీనిని బాలికలందరికీ అందించడం ద్వారా భవిష్యత్తుల్లో ఏ ఒక్కరూ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడకుండా అడ్డుకోవచ్చు. ఆ క్యాన్సర్‌కు కారణమయ్యే హెచ్‌వీపీ టైప్ 16,18, 6,11 రకాల నుంచి రక్షణ కల్పిస్తోంది. దీనిని హ్యుమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్‌గా పిలుస్తారు.
2030 నాటికి భారత్‌లో మహిళలెవ్వరూ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడకుండా నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారు. దీని వల్ల భారత్‌లో కేన్సర్ ముప్పు తగ్గుతుంది. 30 ఏళ్లలోపు మహిళలు ఈ టీకాను తీసుకోవడం వల్ల క్యాన్సర్ బారిన భవిష్యతులో పడే అవకాశం తక్కువగా ఉంటుందని అంతర్జాతీయ పరిశోధనల్లో వెల్లడైంది. ప్రస్తుతం దేశంలో తమిళనాడులో 14 ఏళ్ల బాలికలందరికీ హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందించారు. దేశంలో బాలికలందరికీ వ్యాక్సిన్ అందించిన తొలి రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. ఇక తెలంగాణలో కూడా ఈ వ్యాక్సిన్ అందించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల శ్రీకారం చుట్టింది. తెలంగాణలో కూడా సర్వైకల్ క్యాన్సర్ బారిన ఎక్కువమంది పడుతున్నారు. దీంతో కట్టడి చేసేందుకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
ఒక హెచ్‌పీవీ వ్యాక్సిన్ డోస్‌తో పూర్తి స్థాయిలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుంచి బయటపడవచ్చని పరిశోధనల్లో తేలింది. దీంతో ఒక డోసు వేయించుకున్నా సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలో సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్న మహిళలకు సంబంధించి చైనా తొలి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత రెండో స్థానంలో ఉంది. ఇక మూడో స్థానంలో భారత్ కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడుతుండగా.. ఇండియాలో ఈ సంఖ్య 15 లక్షలుగా ఉంది. ఇక 2040 నాటికి 20 లక్షలకు చేరుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి. దీంతో భవిష్యుత్తులో భారత్‌లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారి నుంచి మహిళలను కాపాడేందుకు కేంద్రం ఉచితంగా వ్యాక్సినేషన్ ఇవ్వాలని నిర్ణయించింది.