
నేపాల్‌లో ఆగస్టు 26న జరిగిన ఘోర విపత్తు ఇప్పుడు భారత్‌లోని హిమాలయ ప్రాంతాలపై మళ్లీ పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది. గ్లేసియర్ కూలిపోవడంతో భారీగా రాళ్లు, మంచు, మట్టి కొండల నుంచి కిందికి దూసుకొచ్చి నదీ లోయలను ముంచెత్తింది. వందల మంది ప్రాణాలు కోల్పోగా.. వేల మంది గల్లంతయ్యారు. అంతేకాదు.. ఆ విపత్తు తర్వాత అక్కడే కొత్తగా నీటి మడుగులు ఏర్పడటం, మరోసారి వరద ముప్పు ఉందన్న హెచ్చరికలు రావడం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది.
హిమాలయాల్లో మంచు కరిగే కొద్దీ కొత్త సరస్సులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే ఉన్న సరస్సులు కూడా కొన్ని ప్రాంతాల్లో విస్తరిస్తున్నాయి. ఉపగ్రహ డేటా ఆధారంగా హిమాలయ రాష్ట్రాల్లో సుమారు 7,500 గ్లేసియర్ సరస్సులు ఉన్నాయని అధ్యయనాలు గుర్తించాయి. వీటిలో దాదాపు 190 సరస్సులను అత్యంత అధిక GLOF ముప్పు ఉన్నవిగా గుర్తించిన అంచనాలు ఉన్నాయి.
అయితే ఈ సంఖ్యను 190 సరస్సులు ఎప్పుడైనా పేలిపోతాయి అని అర్థం చేసుకోవడం తప్పు. ప్రతి గ్లేసియర్ సరస్సు ప్రమాదకరం కాదు. సరస్సు ఎంత పెద్దది, ఎంత వేగంగా విస్తరిస్తోంది, దాన్ని అడ్డుకుంటున్న మంచు లేదా మోరైన్ డ్యామ్ ఎంత బలంగా ఉంది, పైభాగంలో హిమనదం పరిస్థితి ఏంటి, కింద ఎంత జనాభా ఉంది.. ఇలా అనేక అంశాల ఆధారంగా అసలు ప్రమాదాన్ని అంచనా వేయాలి.
భారత్‌లో సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా హిమాలయ ప్రాంతంలోని గ్లేసియర్ లేక్స్, వాటర్ బాడీలను నిరంతరం పర్యవేక్షిస్తోంది. దాదాపు 25 ఎకరాల విస్తీర్ణం కంటే పెద్ద 902 సరస్సులు, నీటి మడుగులను ప్రతి ఏడాది జూన్ నుంచి అక్టోబర్ మధ్య రిమోట్ సెన్సింగ్ ద్వారా మానిటర్ చేస్తున్నామని కేంద్రం తెలిపింది.
హిమాలయాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ గ్లేసియర్లు వెనక్కి తగ్గుతున్నాయి. మంచు కరిగిన చోట నీరు చేరుతుంది. కొన్ని ప్రాంతాల్లో మోరైన్ అని పిలిచే రాళ్లు, మట్టి, మంచు సహజ అడ్డుగోడలా మారి నీటిని నిలిపేస్తాయి. అలా ఏర్పడిన సరస్సు ఒక్కసారిగా పెద్దదైతే.. ఆ సహజ అడ్డుగోడ బలహీనపడుతోంది. భారీ మొత్తంలో నీరు ఒక్కసారిగా కిందికి దూసుకెళ్లే ప్రమాదం ఉంటుంది. దానినే Glacial Lake Outburst Flood — GLOF అంటారు.
ఇది సాధారణ వరద కాదు. కొండపై నుంచి ఒక్కసారిగా విడుదలయ్యే నీటితో పాటు మంచు, రాళ్లు, మట్టి, చెట్ల కొమ్మలు, నిర్మాణాల శిథిలాలు అన్నీ కలిసి దిగువకు దూసుకెళ్తాయి. అందుకే నది మార్గంలో ఉన్న ప్రాంతాలకు నష్టం చాలా వేగంగా జరుగుతుంది. ఇటీవలి అధ్యయనాల ప్రకారం హిమాలయ-కారాకోరం ప్రాంతంలో ఇప్పటివరకు 388కు పైగా GLOF ఘటనలు నమోదయ్యాయి. గ్లేసియర్ సరస్సుల విస్తరణ, మంచు కరుగుదల, తీవ్రమైన వర్షాలు ఈ ప్రమాదాన్ని పెంచుతున్నాయి.
భారత్‌లో లడఖ్, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ హిమాలయ ప్రాంతాలు ప్రత్యేకంగా కీలకం. ఇందులో సిక్కిం చాలా సెన్సిటివ్ జోన్ లో ఉంది. సిక్కిం హిమాలయాల్లో గ్లేసియర్ సరస్సులపై జరిగిన ఒక అధ్యయనంలో 51 సరస్సులను GLOFకు గురయ్యే అవకాశముందని చెబుతున్నారు. వాటిలో 7 సరస్సులను అత్యంత ప్రమాదకరంగా, మరో 6 సరస్సులను హై రిస్క్‌గా వర్గీకరించారు.
మరో తాజా అధ్యయనంలో సిక్కింలో అత్యంత ప్రమాదకర సరస్సులకు డ్యామ్ బ్రేక్ సిమ్యులేషన్లు కూడా చేశారు. అత్యంత తీవ్రమైన పరిస్థితుల్లో ఖంచుంగ్, సౌత్ లోనాక్ వంటి సరస్సుల నుంచి భారీ స్థాయిలో నీటి ప్రవాహం వచ్చే అవకాశం ఉందని మోడలింగ్ సూచించింది. 2023లో సౌత్ లోనాక్ సరస్సు విపత్తు సిక్కింకు ఇచ్చిన హెచ్చరిక ఇంకా మరిచిపోలేదు. ఆ ఘటనలో వచ్చిన వరదతో నదీ లోయలో భారీ నష్టం జరిగింది.
హిమాచల్‌ప్రదేశ్‌లో కూడా గ్లేసియర్ సరస్సుల విస్తరణపై ఆందోళనలు ఉన్నాయి. 2011 నుంచి 2025 వరకు భారత పరిధిలోని గ్లేసియర్ లేక్స్ మొత్తం నీటి విస్తీర్ణం పెరిగిందని CWC డేటా ఆధారంగా వచ్చిన విశ్లేషణలు సూచిస్తున్నాయి. 2025లో CWC పర్యవేక్షణలో ఉన్న సరస్సుల్లో 432 సరస్సులు “vigorous monitoring” అవసరమయ్యే స్థాయిలో గుర్తించారు. వీటిలో లడఖ్, జమ్మూకశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ ప్రాంతాల సరస్సులు ఉన్నాయి. ప్రమాదం ఒకే రాష్ట్రానికి పరిమితం కాదు.
ఒక గ్లేసియర్ సరస్సు ప్రమాదకరమా కాదా అన్నది కేవలం దాని పరిమాణంతో నిర్ణయించలేం. సరస్సు ఎంత వేగంగా పెరుగుతోంది? దాని సహజ అడ్డుగోడ ఎంత బలంగా ఉంది? గ్లేసియర్ దానికి ఎంత దగ్గరగా ఉంది? నీటిలోకి ఎంత శక్తి చేరుతుంది? కింద ఎన్ని గ్రామాలు ఉన్నాయి? ఎన్ని రోడ్లు, వంతెనలు, డ్యామ్‌లు ఉన్నాయి? వరద వస్తే ప్రజలకు ఎంత సమయం ఉంటుందనే విషయంపై ఆధారపడి ఉంటోంది. భారత్‌లో గ్లేసియర్ బాంబులు ఎన్ని అన్నదానికి ఒక్క సంఖ్య చెప్పడం కంటే.. ఎన్ని హై రిస్క్.. వాటి కింద ఎంత జనాభా ఉంది ఎంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేదే కీలకం.
ఇక్కడ నేపాల్ విపత్తు చాలా కీలకమైన కేస్ స్టడీగా తీసుకోవాలి. ఆగస్టు 26న జరిగిన ఘటనను కేవలం గ్లేసియర్ లేక్ పేలిందని చెప్పడం సరైంది కాదు. అందుబాటులో ఉన్న ప్రాథమిక భౌగోళిక అంచనాలు గ్లేసియర్ కూలిపోవడం, ఐస్-రాక్ అవలాంచ్, దాని వెంట వచ్చిన భారీ డెబ్రిస్ ఫ్లో ఈ విపత్తుకు కారణమని సూచిస్తున్నాయి. గ్లేసియర్ ప్రమాదం అంటే కేవలం సరస్సు పేలడం మాత్రమే కాదు. మంచు కొండ కూలినా, అవలాంచ్ వచ్చినా, సహజ అడ్డుగోడ తెగినా, భారీ వర్షం పడినా ఒకదానితో ఒకటి కలిసి కాస్కేడింగ్ డిజాస్టర్‌గా మారొచ్చు.
నేపాల్-చైనా సరిహద్దు ప్రాంతంలో విపత్తు తర్వాత కొత్తగా నీటి మడుగులు ఏర్పడ్డాయి. ఉపగ్రహ పరిశీలనలో దాని పరిమాణం తగ్గుతున్నప్పటికీ.. మరో పెద్ద నీటి మడుగు కూడా గుర్తించడంతో పూర్తిగా ప్రమాదం తొలగిపోలేదని అధికారులు హెచ్చరిస్తున్నారు.
హిమాలయాల్లో ఉన్న ప్రతి ముఖ్యమైన గ్లేసియర్ సరస్సును శాటిలైట్ ద్వారా మ్యాప్ చేయాలి. ఆ సరస్సు పరిమాణం ఏడాదికేడాది ఎలా మారుతోంది అన్నది ట్రాక్ చేయాలి.శాటిలైట్ ఒక్కటే సరిపోదు. అత్యంత ప్రమాదకర సరస్సుల దగ్గర నీటి మట్టం, ఉష్ణోగ్రత, మోరైన్ కదలికలు, వాతావరణ పరిస్థితులను కొలిచే సెన్సర్లు, కెమెరాలు, ఆటోమేటిక్ అలర్ట్ వ్యవస్థలు అవసరం.
సరస్సులో మార్పు గుర్తించిన వెంటనే.. ఆ సమాచారం జిల్లా యంత్రాంగానికి వెళ్లాలి. అక్కడి నుంచి సైరన్లు, మొబైల్ అలర్ట్స్, గ్రామస్థాయి కమ్యూనికేషన్ ద్వారా ప్రజలకు చేరాలి. వరద వస్తే ఎక్కడికి వెళ్లాలి అన్నది ప్రజలకు ముందే తెలియాలి. రూట్లు ఉండాలి. సేఫ్ జోన్లు ఉండాలి. మాక్ డ్రిల్స్ జరగాలి. డ్యామ్‌లు, హైడ్రో ప్రాజెక్టులతో వందల కిలోమీటర్ల దిగువకు వెళ్లొచ్చు. మధ్యలో ఉన్న రోడ్లు, వంతెనలు, పవర్ ప్రాజెక్టులు, పట్టణాలు అన్నీ ప్రమాదంలో పడొచ్చు.
గ్లేసియర్ సరస్సు ఎప్పుడు పేలుతుందో ఎదురుచూడటం కాదు. అది ప్రమాదకర స్థాయికి చేరకముందే గుర్తించాలి. ఎందుకంటే గ్లేసియర్ పైన జరిగే మార్పు కొన్ని గంటల్లోనే కొండ కింద ఉన్న ఒక గ్రామం భవిష్యత్తును మార్చేయగలదు.
-కొండవీటి శివనాగరాజు, డిప్యూటీ అవుట్ పుట్ ఎడిటర్, టీవీ9.