General Motors India: యూఎస్ కార్ మేకర్ జనరల్ మోటార్స్ భారత్‌లో 1,419 మంది ఉద్యోగం నుంచి తొలగించింది. పూణె శివారులోని తాలేగావ్ ప్లాంట్‌లో పని చేస్తున్న వీరికి పారిశ్రామిక వివాద చట్టంలోని సెక్షన్ 25 ప్రకారం లే ఆఫ్ ఇచ్చింది. అయితే ఒక్కసారి పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించడంపై ఉద్యోగ సంఘాలు మండిపతున్నాయి. ఈ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయాలని నిర్ణయించాయి. లే ఆఫ్ ప్రకటించిన ఉద్యోగులందరికీ కంపెనీ ఓ ఈ-మెయిల్ పంపింది. అదే కాపీని జనరల్ మోటార్స్ ఉద్యోగుల యూనియన్ కార్యదర్శి, అధ్యక్షుడికి కూడా పంపింది. పారిశ్రామిక వివాద చట్టం 1947లోని సెక్షన్ 25-సి ప్రకారం వీరందరికి లే ఆఫ్ పరిహారం లభిస్తుందని జనరల్ మోటార్స్ తెలిపింది.అలాగే, వారి మూల వేతనంలో 50 శాతాన్ని పరిహారంగా చెల్లిస్తామని వెల్లడించింది. ఉద్యోగులను తొలగిస్తూ కంపెనీ తీసుకున్న నిర్ణయంపై తాము కోర్టులో తేల్చుకుంటామని జనరల్ మోటార్స్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు సందీప్ భెగాడే తెలిపారు.