గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఆయన చిత్తూరు వెళ్లిపోతారనే ప్రచారం జోరందుకుంది. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆయన సిద్దమయ్యారంటూ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. కార్యకర్తల మాటలెలా ఉన్నా ఆయన మాత్రం నియోజకవర్గంలో కనిపించకపోవడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎంపి గల్లా జయదేవ్ వ్యవహారం చూస్తుంటే ఇప్పుడు ఇలాంటి డౌట్లే వస్తున్నాయి. ఇంతకీ ఆయన మనస్సులో ఏముంది? ఎందుకని నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గం మారే ఆలోచనలో ఉన్నారా? వచ్చే ఎన్నికల నాటికి సొంత జిల్లా చిత్తూరుకు షిఫ్టవుతారా? అనే ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి. లోకల్ క్యాడర్‌లోనూ ఇలాంటి అనుమానాలే కలుగుతున్నాయి.
2014 ఎన్నికల్లో గుంటూరు ఎంపిగా పోటీ చేసిన గల్లా జయదేవ్.. వైసిపి అభ్యర్ధి వల్లభనేని బాలశౌరి మీద విజయం సాధించారు. మొదటి ప్రయత్నంలోనే విజయం అందుకున్న గల్లా.. నిత్యం నియోజకవర్గంలోనే ఉంటూ, రాజధాని భూసేకరణతో పాటు, పలు కీలకకార్యక్రామాల్లో భాగమయ్యారు. తిరిగి, 2019 ఎన్నికల్లోనూ అదే స్థానంలో పోటీ చేసి.. వైసిపి అభ్యర్ధి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిపై గెలిచి రెండోసారి ఎంపీగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. అయితే, ఆయన ఎంపీగా గెలిచినా.. రాష్ట్రంలో టీడీపీ ఘోరంగా ఓడింది. దీంతో అప్పట్నుంచీ నియోజకవర్గానికి దూరంగానే ఉంటున్నారు గల్లా.
గతంలో జయదేవ్‌తో పాటు ఆయన తల్లి, మాజీ మంత్రి అరుణ కూడా.. నిత్యం నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండేవారు. కానీ, అధికారం లేకపోవటంతో ఎవరూ నియోజకవర్గం వైపు చూడటం లేదన్న విమర్శలు వినవస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గల్లా కుటుంబం, వారి వ్యాపారాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందనీ.. అందుకే రాజకీయంగా యాక్టివ్‌గా లేరంటూ అభిమానులు, అనుచరులు చెప్పుకొంటున్నారు. భారీస్థాయిలో జరిగిన రాజధాని ఉద్యమంలోనూ గల్లా జయదేవ్ పాత్ర అంతంత మాత్రమేనంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. లోక్‌సభలో అప్పుడెప్పుడో రాజధాని గురించి మాట్లడటం తప్ప.. పెద్దగా ఆయన స్పందించలేదని అనుచరులే అభిప్రాయపడుతున్నారు.
వచ్చే ఎన్నికల నాటికి గల్లా గుంటూరు విడిచి చిత్తూరు వెళ్లిపోతారనే ప్రచారం జరుగుతోంది. చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, టిడిపి పరిస్థితి ఇలా ఉంటే.. వైసిపి అభ్యర్ధిగా ఓడిన మోదుగుల.. గుంటూరు పార్లమెంట్ పరిధిలో యాక్టివ్‌గా తిరుగుతున్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ.. పార్టీ కార్యక్రమాలను ముందుండి నడిపిస్తున్నారు. అయితే ఆయన మనస్సంతా నర్సరావుపేట వైపే ఉన్నట్లు అభిమానులు చెప్పుకొంటున్నారు. దీంతో, ఈసారి గుంటూరు పార్లమెంటు అభ్యర్థుల విషయంలో.. అటు వైసీపీ, ఇటు టీడీపీ.. రెండు పార్టీల్లోనూ సందిగ్ధత కనిపిస్తోంది. అందుకే, అత్యంత్య ప్రాధాన్యత కలిగిన గుంటూరు ఎంపీ స్థానంపై.. రెండు పార్టీల హైకమాండ్‌లూ ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.
మరిన్ని ఏపీ వార్తల కోసం..