దేశంలో ఉగ్రదాడులకు కుట్రపన్నిన నలుగురిని.. ఎన్‌ఐఏ అధికారులు తమిళనాడులో అరెస్ట్ చేశారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న పలువురు తమిళనాట భారీగా నిధులు సేకరిస్తున్నారన్న సమాచారంతో మన్నడిలో సయ్యద్ బుహారీ, మంజకొల్లైలో హరీష్, మహమ్మద్ అలీ, సిక్కల్‌లో హాసన్ అలీలను ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు.
ఆదివారం హరీష్ స్నేహితుడు తవహీద్ మహమ్మద్ ఇంట్లోనూ తనిఖీలు చేసి.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఉగ్రవాద అనుకూల కరపత్రాలు, సంస్థ పతాకాలు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను కొచ్చిన్‌లో ఉన్న ఎన్‌ఐఏ ప్రధాన కార్యాలయానికి తరలించి విచారించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
వీరిలో హరీష్, హాసన్, హన్సరుల్లా అనే ఉగ్రవాద సంస్థను నెలకొల్పి భారీగా నిధులు సేకరించినట్టు దర్యాప్తులో వెల్లడైంది. వారిద్దరినీ చెన్నై సమీప పూందమల్లి మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరుచగా.. 15 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించింది న్యాయస్థానం. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.