తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పదుల సంఖ్యలో పడవలు, ద్విచక్ర వాహనాలు, ఇళ్లు, కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఈ ఘర్షణలతో సంబంధం ఉన్న 50 మందిని అరెస్టు చేశామన్నారు పోలీసులు. చాలా రోజులుగా రెండు వర్గాల మధ్య రాజకీయ వైరం కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. గతేడాది డిసెంబరులో జరిగిన పంచాయితీ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలు అడపా దడపా ఇంకా ఉద్రిక్తలకు కారణమవుతున్నాయని పోలీసులు వెల్లడించారు.
అయితే, కొద్ది రోజుల క్రితం స్థానిక రాజకీయ నాయకుడి సోదరుడిని ప్రత్యర్థి వర్గం హత్య చేసింది. దీంతో సదరు నాయకుడికి చెందిన వ్యక్తులు ప్రత్యర్థి వర్గానికి చెందిన ఇళ్లపై దాడి దిగినట్లు స్థానిక వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని ఘర్షణ జరిగిన ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించి బందోబస్తు ఏర్పాటు చేశామని కడలూరు జిల్లా పోలీసు అధికారి ఎం. శ్రీ అభినవ్ తెలిపారు.