ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ఘాజీపూర్ బోర్డర్ వద్దకు రైతులు భారీ సంఖ్యలో చేరుకోవడంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దేశ రాజధానిలోకి వస్తున్న ట్రాక్టర్లను అడ్డుకునేందుకు సీఆర్ పీ ఎఫ్ బలగాలను మోహరించారు. సరిహద్దుల్లో ఎక్కడికక్కడ బారికేడ్లతో పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ కు చెందిన భారీ వాహనాలను రోడ్లకు అడ్డంగా పెట్టారు.
ట్రాక్టర్లను నగరంలోకి అనుమతించాలని కోరుతూ పోలీసులతో రైతు సంఘాల నేతలు వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అన్నదాతలు బారికేడ్లను పక్కకు నెట్టి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. గందరగోళ పరిస్థితులతో ఈ ప్రాంతం అంతా యుద్ధ భూమిలా మారింది.
ర్యాలీలో 5వేల ట్రాక్టర్లకే అనుమతి ఇచ్చినా… ఢిల్లీ, హర్యానా నుంచి వేల సంఖ్యలో రైతులు ట్రాక్టర్లతో వచ్చారు. ర్యాలీలో పాకిస్తాన్ ప్రేరేపిత అరాచక శక్తులు చొరబడే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు అనుమతించిన దాని కంటే ఎక్కువగా ట్రాక్టర్లు రావడంతో పోలీసులు వాటిని అడ్డుకున్నారు. దీంతో ఘాజీపూర్, టిక్రీ వద్ద టెన్షన్ పెరిగింది.
ట్రాక్టర్ల ర్యాలీ ప్రారంభానికి ముందే సరిహద్దుల్లో ఉద్రిక్తత మొదలైంది. జాతీయ జండాలు పట్టుకున్న రైతులు ఒక వైపు.. వారిని అడ్డుకునేందుకు మోహరించిన సీఆర్ పీఎఫ్ బలగాలు మరోవైపు. ఘాజీపూర్ బోర్డర్ యుద్ధ వాతావరణాన్ని తలపించింది. పంజాబ్ నుంచి కొంతమంది రైతులు గుర్రాల మీద వచ్చారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేట్లను తొలగిస్తూ ముందుకెళ్లే ప్రయత్నం చేశారు.
పోలీసులు రైతుల మీద విచక్షణారహితంగా లాఠీలతో విరుచుకు పడ్డారు. పంజాబ్ నుంచి గుర్రాల మీద వచ్చిన కొంతమంది రైతులు… పోలీసులకు కత్తులు చూపిస్తూ… తమకు అడ్డు రావద్దని హెచ్చరించారు. రైతుల ఆగ్రహన్ని చూసి పోలీసులు కూడా వెనకడుగు వేశారు.