రాజస్థాన్(Rajasthan) లోని బార్మర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-ట్రక్కు ఢీ కొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. గూడమలాని(Gudamalani High Way) హైవేపై ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటన తర్వాత కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కారులో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్తున్న సమంలో గూడమలాని హైవేపై కారు వేగంగా ట్రక్కును ఢీ కొట్టింది. సమాచారం అందుకున్న స్థానికులు అక్కడికి చేరుకుని కారులో ఉన్న మిగతా వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా, తీవ్రంగా గాయపడ్డ నలుగురిని గూడమలానీ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇద్దరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం సాంచోర్కు తరలించారు.
ఈ ప్రమాదంలో పెళ్లికి వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గమ్యం చేరుకోవాల్సిన ప్రాంతానికి 8 కిలో మీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం జరగడంతో మృతుల కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి