PM Modi: జోర్డాన్‌తో ఐదు కీలక ఒప్పందాలు.. ప్రధాని మోదీ టూర్ గ్రాండ్ సక్సెస్

ప్రధాని మోదీ సోమవారం జోర్డాన్ దేశ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆ దేశంతో ఐదు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. రెన్యూవబుల్ ఎనర్జీ, నీటి వనరులు, డిజిటల్ సంస్కరణ విషయంలో ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందాలు రెండు దేశాల మధ్య సంబంధాలను పెంచుతాయని అంటున్నారు.

PM Modi: జోర్డాన్‌తో ఐదు కీలక ఒప్పందాలు.. ప్రధాని మోదీ టూర్ గ్రాండ్ సక్సెస్
Pm Modi

Updated on: Dec 16, 2025 | 11:08 AM

ప్రధాని మోదీ సోమవారం జోర్డాన్ పర్యటనకు వెళ్లగా.. అక్కడ ఘన స్వాగతం లభించింది. ఈ సందర్బంగా ఆ దేశ రాజు అబ్దుల్లా-2 ఇబిన్ అల్ హుసేన్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న సంబంధాలు, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలతో పాటు రెండు దేశాల మధ్య దౌత్య, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఈ కీలక భేటీలో రెండు దేశాల మధ్య పలు అగ్రిమెంట్లు జరిగాయి. ఈ విషయాన్ని ప్రధాని మోదీ తన ఎక్స్ అకౌంట్‌లో పేర్కొన్నారు. భారత్-జోర్డాన్ మధ్య జరిగిన ఎంఓయూ వివరాలను కూడా వివరించారు.

అగ్రిమెంట్లు ఇవే..

న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి టెక్నికల్ విషయాల్లో రెండు దేశాలు పరస్పరం సహకరించుకోవడం, జల వనరుల నిర్వహణ, అభివృద్ధిలో పరస్పర సహకారం, పెట్రా, ఎల్లోరా మధ్య ట్విన్నింగ్ ఒప్పందం , సాంస్కృతిక మార్పిడి కార్యక్రమం (2025-2029) పునరుద్ధరణ వంటి, డిజిటల్ ఆవిష్కరణలను రెండు దేశాలు పంచుకోవడం వంటి ఐదు అగ్రిమెంట్లు ఇరు దేశాల మధ్య జరిగినట్లు ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇవి భారత్-జోర్డాన్ మధ్య సంబంధాలను మరింత పెంచుతాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.

37 ఏళ్లల్లో ఇదే తొలిసారి

జోర్డాన్‌తో ఐదు కీలక ఒప్పందాలు జరగడంతో ప్రధాని మోదీ జోర్డాన్ దేశ పర్యటన గ్రాండ్ సక్సెస్ అయిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జోర్డాన్‌లో భారతీయులు చాలామంది నివసిస్తున్నారు. ఆ దేశం మనకు ఎరువులను ఎక్కువగా సరఫరా చేస్తోంది. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల విలువ దాదాపు 280 కోట్ల డాలర్లుగా ఉంది. పూర్తిస్థాయి ద్వైపాక్షిక సంబంధాల కోసం భారత ప్రధాని జోర్డాన్‌కు వెళ్లడం 37 ఏళ్లల్లో ఇదే తొలిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు.