భారత అమ్ముల పొదిలోకి మరో అస్త్రం త్వరలో చేరనుంది. యుద్ధ ట్యాంకుల విధ్వంసక క్షిపణి అయిన “నాగ్”ను ఆదివారం విజయవంతంగా పరీక్షించినట్లు భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) వెల్లడించింది. రాజస్థాన్‌లోని పొఖ్రాన్‌లొ ఈ పరీక్షలు జరిగినట్లు తెలిపారు. మొత్తం మూడు సార్లు ఈ ప్రయోగం చేశామని.. రాత్రి, పగలు రెండు సమయాల్లో నాగ్ క్షిపణి తన లక్ష్యాన్ని చేధించిందిని వెల్లడించారు. కాగా, గతేడాది ఈ క్షిపణి శీతాకాల సామర్థ్య పరీక్షలను విజయవంతంగా ఎదుర్కొన్న విషయం తెలిసిందే. మరికొన్ని పరీక్షల అనంతరం ఇది భారత రక్షణ దళాల అమ్ములపొదిలో చేరనుంది.
థర్డ్‌జనరేషన్‌కు చెందిన ఈ నాగ్ క్షిపణికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకసారి దీన్ని పేల్చితే లక్ష్యాన్ని దానంతట అదే వేటాడుతూ వెళ్లే సామర్థ్యం దీని సొంతం. అంతేగాక దీనిలో ఉన్న అధునాతన ఇమేజింగ్ ఇన్‌ఫ్రారెడ్ రాడార్ సీకర్ సాంకేతికత కేవలం కొన్ని దేశాల వద్ద మాత్రమే ఉంది. దీనిద్వారా లక్ష్యంగా పెట్టుకున్న యుద్ధ ట్యాంక్ ఉష్ణోగ్రత, దాని పరిసరాల ఉష్ణోగ్రత మధ్య తేడాను పసిగట్టి లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో చేధించడం ఈ ఐఆర్‌ఆర్ ప్రత్యేకత. అలాగే ఈ మిస్సైల్ బరువు కూడా తక్కువగా ఉంటుందని.. ఎలాంటి ప్రదేశానికైనా దీనిని సులువుగా తరలించవచ్చని డీఆర్‌డీవో వెల్లడించింది.