వీళ్ళేక్కడి మనుషులు రా సామి..! వ్యాపారిని చంపి అల్ట్రాసౌండ్ మిషన్ ఎత్తుకెళ్లిన డాక్టర్!

ఢిల్లీలో ఒక డాక్టర్ బరి తెగించాడు. ఇద్దరు వార్డు బాయ్‌లతో కలిసి 68 ఏళ్ల వైద్య పరికరాల వ్యాపారిని హతమార్చారు. అనంతరం అతని షోరూమ్‌ నుంచి అల్ట్రాసౌండ్ యంత్రాన్ని, ఇతర వైద్య పరికరాలను దోచుకున్నారు. ఈ సంఘటన తర్వాత, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను అరెస్టు చేసిన పోలీసులు, దోచుకున్న వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

వీళ్ళేక్కడి మనుషులు రా సామి..! వ్యాపారిని చంపి అల్ట్రాసౌండ్ మిషన్ ఎత్తుకెళ్లిన డాక్టర్!
Delhi Murder Case

Updated on: Feb 19, 2025 | 5:35 PM

దేశ రాజధాని ఢిల్లీలో ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక డాక్టర్, ఇద్దరు వార్డు బాయ్‌లతో కలిసి ఒక వ్యాపారవేత్తను హత్య చేశాడు. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. హత్య అనంతరం అతని వద్ద ఉన్న వస్తువులన్నింటిని ఎత్తుకెళ్లారు. వైద్య పరికరాల వ్యాపారంలో ఉన్న 68 ఏళ్ల రణబీర్ సింగ్ దారుణ హత్యకు గురయ్యారు. రణబీర్ వద్ద ఉన్న అల్ట్రాసౌండ్ యంత్రం, ఇతర వైద్య పరికరాల కోసం ఈ దారుణం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు మొదట రణబీర్‌ను గొంతు కోసి చంపాడు. దాని కారణంగా అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆ తరువాత, అతనికి గుండెపోటుతో చనిపోయేలా ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చారు. దీంతో రణబీర్ ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం అతని దుకాణం నుంచి విలువైన వైద్య పరికరాలను ఎత్తుకెళ్లారు దుండగులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి దోచుకున్న అల్ట్రాసౌండ్ మెషిన్, ల్యాప్‌టాప్, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యకు ఉపయోగించిన కారును పోలీసులు సీజ్ చేశారు.

నిందితుల్లో ముజఫర్‌నగర్ నివాసి 27 ఏళ్ల మహ్మద్ పర్వేజ్ ఆలం, మొరాదాబాద్ నివాసి 30 ఏళ్ల మహ్మద్ నాసిర్, బాగ్‌పత్ నివాసి 19 ఏళ్ల నిఖిల్ ఉన్నారు. వారిలో, మొహమ్మద్ పర్వేజ్ ఆలం ముజఫర్ నగర్‌లో ఒక క్లినిక్ నడుపుతున్న ఒక నకిలీ వైద్యుడుగా పోలీసులు గుర్తించారు. నాసిర్, నిఖిల్ వార్డ్ అతని వద్ద వార్డు బాయ్స్‌గా పనిచేస్తున్నారు. రణబీర్ కుటుంబసభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఈ నిందితులను అరెస్టు చేసి, దోచుకున్న వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

ఈ సంఘటన ఫిబ్రవరి 1న జరిగింది. పోలీసులకు సారాయ్ రోహిల్లా పోలీస్ స్టేషన్‌లో కాల్ వచ్చింది. పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని రణబీర్ సింగ్ అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. శరీరంపై బాహ్య గాయాల గుర్తులు లేవు, కానీ రణబీర్ కుమారుడు అల్ట్రాసౌండ్ యంత్రం, ఇతర వస్తువులు కనిపించకపోవడంతో హత్యగా అనుమానించాడు. పోలీసులు 300 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితులను పట్టుకోవడంలో విజయం సాధించారు.

ఈ హత్యకు ప్రధాన సూత్రధారి మహ్మద్ పర్వేజ్ ఆలం అని దర్యాప్తులో తేలింది. అతనికి అల్ట్రాసౌండ్ యంత్రం అవసరం. బాధితుడు రణబీర్ వ్యాపారం గురించి సమాచారం అందింది. అతను ఎనిమిది నెలల క్రితం ఈ యంత్రాన్ని కొనడానికి ప్రయత్నించాడు. కానీ ఒప్పందం కుదరలేదు. ఆ తర్వాత తన ఇద్దరు స్నేహితులతో కలిసి దోపిడీకి పథకం వేశాడు. ఈ సంఘటన జరిగిన రోజున నకిలీ డాక్టర్, అతని సహచరులు రణబీర్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ వారు అతన్ని పట్టుకుని, చంపి, వస్తువులను దోచుకున్నారు. ఈ కేసులో పోలీసులు వేగంగా చర్యలు తీసుకుని నిందితులను అరెస్టు చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..