Pravasi Bharatiya Divas: ప్రవాస భారతీయ సమ్మేళనం.. నేడు సదస్సును ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలివే..

|

Jan 09, 2023 | 11:06 AM

‘ప్రవాసీ భారతీయ దివస్’ అనేది విదేశాలలో ఉన్న భారతీయ ప్రవాసీల విజయాలను ప్రపంచం ముందుకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ప్రతి ఏటా జనవరి 9న జరుపుకునే వేడుకలు. ఈ క్రమంలోనే నిన్న(జనవరి 8) మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో ఈ ప్రత్యేక దినోత్సవ వేడుకలు..

Pravasi Bharatiya Divas: ప్రవాస భారతీయ సమ్మేళనం.. నేడు సదస్సును ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలివే..
Pm Modi To Inaugurate Pravasi Bharatiya Divas Convention In Indore
Follow us on

‘ప్రవాసీ భారతీయ దివస్(పీబీడీ)’ అనేది విదేశాలలో ఉన్న భారతీయ ప్రవాసీల విజయాలను ప్రపంచం ముందుకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ప్రతి ఏటా జనవరి 9న జరుపుకునే వేడుకలు. ఈ క్రమంలోనే నిన్న(జనవరి 8) మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో ఈ ప్రత్యేక దినోత్సవ వేడుకలు ప్రారంభం కాగా, ఈ రోజు జరగబోయే సదస్సు కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇక ఇందులో భాగంగా ఆదివారం జరిగిన యూత్ ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు ఎస్ జైశంకర్ , అనురాగ్ ఠాకూర్ ప్రసంగించారు. వారితో పాటు ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా ఆస్ట్రేలియా పార్లమెంటు సభ్యురాలు జనెటా మస్కరెన్హాస్ హాజరయ్యారు. జనవరి 8న మొదలైన ఈ వేడుకలు ఈ నెల 10 వరకు కొనసాగుతాయి. అయితే ప్రవాసీ భారతీయ దివస్ జరుపుకోవడానికి వెనుక సుదీర్ఘ చరిత్రే ఉంది. ఆ చరిత్రలో జాతిపిత మహాత్మా గాంధీకి కూడా భాగమే. ఇక 2003 నుంచి దేశంలో ప్రవాసీ భారతీయ దివస్‌ను జరుపుకుంటున్నారు.

జనవరి 9 ప్రత్యేకత: 

జనవరి 9(1915) అనేది భారత జాతిపిత మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి వచ్చిన రోజు. ఆ కారణంగానే ప్రవాసీ భారతీయ దివస్‌గా జరుపుకోవడానికి ఈ రోజును ఎంచుకున్నారు. ఎల్‌ఎం సింఘ్వీ నేతృత్వంలోని భారతీయ ప్రవాసులపై ఉన్నత స్థాయి కమిటీ జారీ చేసిన సిఫార్సుల మేరకు ప్రవాసీ భారతీయ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. నాటి ప్రధాని అటల్ బీహార్ వాజ్‌పేయి ప్రకటన తర్వాత ప్రవాసీ భారతీయ దివస్‌ను జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు.

ప్రవాసీ భారతీయ దివస్ ముఖ్య ఉద్దేశ్యం:

ప్రవాసీ భారతీయ దివస్‌ను జరుపుకోవడం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం ఏమిటంటే.. విదేశాలలో నివసిస్తున్న భారతీయుల విజయాలను ప్రపంచం ముందు తీసుకురావడం. తద్వారా వారి బలాన్ని, ప్రతిభను ప్రపంచం గుర్తించేలా చేయడం. ఈ ప్రవాసీ భారతీయ దివస్ పేరుతో ప్రవాసీలు స్వదేశీయులతో కలిసే అవకాశం లభిస్తుంది. ఈ నేపథ్యంలోనే విదేశాల్లో ఉన్న భారతీయులను దేశంతో అనుసంధానించడంలో ప్రధాని మోదీ కూడా కీలక పాత్ర పోషించారు. ఆయన విదేశీ పర్యటనకు ఏ దేశానికి వెళ్లినా, భారతీయ ప్రవాసులకు భిన్నమైన గుర్తింపును అందిస్తుంటారు.ప్రవాసులతో ప్రధాని మోదీకి దశాబ్దాల నాటి సంబంధం ఉంది. ఆర్ఎస్ఎస్ యువ కార్యకర్తగా ఉన్న రోజుల్లోప్రపంచమంతటా పర్యటించిన మోదీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులతో వ్యక్తిగత సంబంధాలను ఏర్పరచుకున్నాడు. ఇలా చేయడం వల్ల ఓవర్సీస్ ఇండియన్స్ భారత్ వైపు మరింత ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ప్రధాని మోదీ ప్రసంగాలలో ఎన్నారైలు గుమిగూడిన తీరు.. ప్రధాని మోదీ నాయకత్వం కోసం ఎన్నారైలు పూర్తి నమ్మకం, ఆశతో చూస్తున్నారని చెప్పేందుకు నిదర్శనంగా ఉంది.

ప్రపంచంలో ప్రవాస భారతీయులే అధికం: 

ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ప్రవాసులుగా భారతీయులే ఉన్నారు. 2019లో ప్రపంచవ్యాప్తంగా వారి సంఖ్య 1.8 కోట్లు. వలసదారుల సంఖ్యలో మెక్సికో రెండో స్థానంలో, చైనా మూడో స్థానంలో ఉంది.  ఇంటర్నేషనల్ మైగ్రెంట్ స్టాక్ 2019 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వలస వచ్చిన వారి సంఖ్య 272 మిలియన్లు(27 కోట్ల 20 లక్షలు). ఇందులో మూడింట ఒక వంతు ప్రపంచంలోని 10 దేశాల నుంచి మాత్రమే. ఇక ఈ 10 దేశాలలో కూడా భారత్ ముందంజలో ఉంది. 1.18 కోట్ల మందితో మెక్సికో రెండో స్థానంలో, 1.07 కోట్ల మందితో చైనా మూడో స్థానంలో ఉన్నాయి.

కాగా, 2003 నుంచి జరుపుకుంటున్న ప్రవాసీ భారతీయ దివస్ కారణంగా ప్రవాసీలతో భారతీయ సంబంధాలు మరింత బలపడుతున్నాయి. అలాగే ప్రవాసీల కారణంగా భారత్‌లో విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నాయి. దీని ప్రత్యక్ష ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతోంది. ఒక నివేదిక ప్రకారం భారతదేశంలో ఎఫ్‌డీఐ 2022 సంవత్సరంలో 100 బిలియన్ డాలర్లు దాటవచ్చని అంచనా.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.