రైతు బిల్లులను వ్యతిరేకిస్తూ డీఎంకె ఎంపీ తిరుచ్చిశివ సుప్రీంకోర్టుకెక్కారు. ఈ బిల్లులు చట్టాలుగా మారాయని, కానీ వీటి వల్ల అన్నదాతలకు మేలు జరగకపోగా నష్టమే ఎక్కువగా జరుగుతుందని ఆయన తన ‘పిల్’ లో పేర్కొన్నారు. రైతులు కార్పొరేట్ సంస్థల బానిసలుగా మారుతారని, దేశంలో కృత్రిమంగా ధరలు పెరిగి ఎకానమీకి కూడా నష్టం వాటిల్లుతుందని ఆయన అన్నారు. పార్లమెంట్ ఈ బిల్లులను హడావుడిగా, విపక్షాలతో ఎలాంటి చర్చలు లేకుండానే ఆమోదించిందని తిరుచ్చి శివ పేర్కొన్నారు. ప్రభుత్వ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. అత్యున్నత న్యాయస్థానం ఈ పిల్ పై సమగ్ర విచారణ జరపాలని ఆయన కోరారు. రాజ్యసభలో రైతు బిల్లులపై రభస సందర్భంగా తిరుఛ్చి శివ కూడా తీవ్ర నిరసన తెలిపిన విదితమే.