
విమానాల్లో పవర్ బ్యాంకులు, లిథియం బ్యాటరీ పరికరాలకు సంబంధించి కఠినమైన నిబంధనలు అమలు చేయడం జరుగుతుందని DGCA తెలిపింది. విమాన ప్రయాణ సమయంలో ఫోన్లు లేదా ఇతర పరికరాలను ఛార్జ్ చేయడానికి పవర్ బ్యాంకుల వాడకాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిషేధించింది. ప్రపంచవ్యాప్తంగా పవర్ బ్యాంకులకు సంబంధించిన అనేక అగ్నిప్రమాదాల సంఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో DGCA ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుత విమానయాన భద్రతా మార్గదర్శకాల ప్రకారం, పవర్ బ్యాంకులు చెక్-ఇన్ లగేజీలో కాకుండా క్యాబిన్ బ్యాగేజీలో మాత్రమే అనుమతించడం జరుగుతుంది. అయితే, ప్రయాణీకులు విమానాల సమయంలో పవర్ బ్యాంక్‌లను ఉపయోగించి పరికరాలను ఛార్జ్ చేయడానికి అనుమతించరు. విమానయాన సంస్థలు ఇప్పుడు బోర్డింగ్ ప్రకటనలు, విమానంలో బ్రీఫింగ్‌ల ద్వారా ప్రయాణీకులకు ఈ పరిమితి గురించి గుర్తు చేయడం ప్రారంభించాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) భవిష్యత్తులో మరింత కఠినమైన చర్యలు తీసుకోవచ్చు. విమాన ప్రయాణాన్ని సురక్షితంగా చేసేందుకు చర్యలు చేపట్టింది.
గత ఏడాది నవంబర్‌లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) పవర్ బ్యాంకులకు సంబంధించి ఒక అడ్వైజరీ జారీ చేసింది. పవర్ బ్యాంకులు, స్పేర్ బ్యాటరీలను హ్యాండ్ లగేజీలో మాత్రమే అనుమతించడం జరుగుతుంది. ఓవర్ హెడ్ కంపార్ట్‌మెంట్‌లో నిల్వ చేయలేమని పేర్కొంది. దీనికి కారణం మంటలు సంభవించే ప్రమాదం ఉందని, దీని వలన నియంత్రించడం కష్టమవుతుందని తెలిపారు. లిథియం బ్యాటరీలు అధిక శక్తి కంటెంట్ కారణంగా చాలా త్వరగా మంటలు అంటుకుంటాయని చెబుతున్నారు. చిన్న బ్యాటరీ మంట కూడా విమాన క్యాబిన్ లోపల వేగంగా వ్యాపించగలదని, దీని వలన జాగ్రత్తలు చాలా కీలకమని విమాన భద్రతా నిపుణులు అంటున్నారు.
పవర్ బ్యాంకులు, పోర్టబుల్ ఛార్జర్లు, లిథియం బ్యాటరీలు మంటలకు కారణమవుతాయి. “వివిధ రీఛార్జబుల్ పరికరాల్లో లిథియం బ్యాటరీలను విస్తృతంగా ఉపయోగించడం వల్ల విమానాల్లో లిథియం బ్యాటరీలను తీసుకెళ్లడం పెరిగింది. పవర్ బ్యాంక్‌లు, పోర్టబుల్ ఛార్జర్లు, లిథియం బ్యాటరీలను కలిగి ఉన్న ఇలాంటి పరికరాలు విమానాల్లో మంటలకు కారణమవుతాయి. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా విమానాల్లో అనేక మంటలు సంభవించాయి” అని DGCA సర్క్యులర్ పేర్కొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..